- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని (లూకా 22:32).
క్రైస్తవుడా, నీ విశ్వాసాన్ని గురించి జాగ్రత్తపడు. ఆశీర్వాదాలను పొందడానికి ఏకైక మార్గం విశ్వాసమే అని గుర్తించుకో. కేవలం ప్రార్ధనవల్ల దేవునినుండి జవాబులు రాబట్టలేం. ఆ ప్రార్థన విశ్వసించే వ్యక్తి చేసిన ప్రార్థనై ఉండాలి.
పరలోకాన్నీ భూమినీ కలిపే టెలిగ్రాఫ్ తీగె విశ్వాసమే. దేవుని ప్రేమ సందేశాలు ఆ తీగె ద్వారా ఎంత వేగంగా పరిగెడతాయంటే అసలు మనం పిలువకముందే ఆయన మనకు సమాధానం ఇస్తాడు. మనం మాట్లాడడం ముగించక మునుపే ఆయన అర్థంచేసుకుంటాడు. కానీ ఆ విశ్వాసమనే తీగె తెగిపోయినప్పుడు ఆ వాగ్దానాన్ని మనమెట్లా పొందగలం?
నాకు కష్టాలొచ్చాయా? నాకు సహాయం విశ్వాసం ద్వారానే దొరుకుతుంది. శత్రువు నన్ను లొంగదీస్తున్నాడా? విశ్వాసం ద్వారానే నా ఆత్మ తన ఆశ్రయదుర్గాన్ని చేరుకుంటుంది.
అయితే విశ్వాసాన్ని తీసెయ్యండి. దేవుణ్ణి గొంతు చించుకుని పిలిచి చూడండి, పలకడు. నా ఆత్మకీ పరలోకానికీ మధ్య మరి యే దారి లేదు. ఆ రోడ్డు మూతబడితే పరలోకపు రాజుకి విన్నపాలు పంపుకునేదెలా?
విశ్వాసమనేది, దైవత్వంతో నాకు సంబంధమేర్పరుస్తుంది. యెహోవా శక్తిని నాకు ధరింపజేస్తుంది. నేను శత్రువు నేదుర్కోవడంలో దేవునిదైన ప్రతి ఆయుధమూ నాకు సహాయపడేలా చేస్తుంది విశ్వాసం. అంధకారశక్తుల్ని అధిగమించడానికది సహాయ పడుతుంది. నా శత్రువుల శిరస్సుల మీదుగా విజయోత్సాహంతో నడిచిపోయేలా చేస్తుంది. అయితే విశ్వాసం లేకుండా దేవునినుండి ఏమీ పొందగలం?
కాబట్టి క్రైస్తవుడా, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నువ్వు నమ్మిక ఉంచగలిగితే చాలు. నమ్మేవాళ్ళకి అన్నీ సాధ్యమే.
మనకి విశ్వాసంలాటి మానసికమైన దానికంటే, మరేదో తాకిచూసి తెలుసుకోగలిగింది కావాలంటాము. కానీ పౌలు ఏమంటున్నాడో చూడండి. వాగ్దానం దృఢమైనది. కావడంకోసం అది విశ్వాసమూలమైనది అయ్యిందట (రోమా 4:16).
విశ్వాసం దేవుణ్ణి ఘనపరుస్తుంది. దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడు.