Skip to Content

Day 164 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నా శాంతినే మీ కనుగహించుచున్నాను (యోహాను 14:27).


ఇద్దరు చిత్రకారులు ప్రశాంతత అనే దానిమీద తమకున్న ఆలోచనని బొమ్మ రూపంలో గీసారు. మొదటి చిత్రకారుడు ఎక్కడో కొండల మధ్య నిండుగా ఉన్న ఒక సరస్సుని తన చిత్రపటంలో చూపించాడు.


రెండో అతను తన కాన్వాసు మీద భీషణమైన ఓ జలపాతాన్ని, దాని నురుగులపైన వంగి రేపో మాపో కూలిపోతుందేమో అన్నట్టుగా ఉన్న ఒక చిన్న చెట్టు. దాని కొమ్మమీద జలపాతపు జల్లుకి దాదాపుగా తడుస్తూ తన గూటిలో కూర్చుని ఉన్న ఓ చిన్న పిచ్చుక. ఈ బొమ్మను హృద్యంగా చిత్రీకరించాడు.


మొదటి చిత్రం జడత్వమే. రెండోది విశ్రాంతి.


క్రీస్తు జీవితం పైకి ఎలా కనిపిస్తుందంటే అంత అల్లకల్లోలమైన జీవితం ఇంకెక్కడా ఉండదేమోననిపిస్తుంది. తుపానులు, అలజడులు, అరిగిపోయిన ఆ శరీరం సమాధిలో విశ్రాంతి పొందేవరకూ, కష్టాల కెరటాలు దాని పై విరుచుకుపడుతూనే ఉన్నాయి. అయితే ఆయన అంతరంగం మాత్రం గాజు సముద్రంలాగా మహా ప్రశాంతతతో ఉందెప్పుడూ.


ఏ నిమిషంలోనైనా ఎవరైనా ఆయన దగ్గరికి వెళితే వాళ్ళకి విశ్రాంతి నిచ్చేవాడు. ఆ రోమా వేట కుక్కలు ఆయన్ని యెరూషలేము వీధుల్లో హింసించ బోయే తరుణంలో కూడా, తన శిష్యులకి తుది కానుకగా "తన శాంతిని" అనుగ్రహించాడు.


విశ్రాంతి అంటే దేవాలయంలో మనకి కలిగే పరిశుద్దానుభూతి కాదు. దేవునిలో లోతుగా నాటుకున్న హృదయపు సంపూర్ణతే.


నీ మనో వేదనలో నా శాంతిని ఇస్తాను

విశ్రాంతితో ఉపశమింపజేస్తాను.


ప్రార్థనలవల్ల ఫలితం లేకున్నా నా శాంతి నీకిస్తాను

నా వాగ్దానాలు వాస్తవాలని తెలియజేస్తాను.


ఒంటరితనంలో నా శాంతిని ఇస్తాను

రాత్రి వేళనే నైటింగేల్ తియ్యగా పాడుతుంది.


శత్రువులు నిందలేసినప్పుడు నా శాంతిని ఇస్తాను

నిందల్లో నా సహవాసాన్ని రుచి చూపిస్తాను.


ఘోర వైపరీత్యంలో నా శాంతిని ఇస్తాను

మహిమ బాటలో సిలువకి నడిపిస్తాను


స్వేదంలో శ్రమలో నా శాంతిని ఇస్తాను

నా నుదుట కారిన చెమట, రక్తాన్ని చూపిస్తాను


నీ చెలికాడు మోసగిస్తే నా శాంతిని ఇస్తాను

ప్రేమ, శాంతి నీ ప్రార్థనకి జవాబుగా ఇస్తాను


చావుతప్ప వేరే దారి లేకుంటే సిలువ దారి

చూపించి నిత్య శాంతిని నీకిస్తాను.


Share this post