Skip to Content

Day 162 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

26 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ప్రభువుయొక్క దాసుడు.. అందరి యెడల సాధువుగాను ఉండవలెను (2 తిమోతి 2:24-26).


దేవుడు మనల్ని లొంగదీసి, స్వాధీనపరచుకొని మనలోని అహంకారాన్ని నరికేసిన తరువాతే మనకి క్రీస్తు ఆత్మ సంబంధమైన దివ్యదర్శనాలు కలుగుతాయి. అప్పుడు మనం ఇంతకు ముందెన్నడూ లేనంత సాధువులుగా మారీ ఈ నరక ప్రాయమైన లోకంలో సాత్వీకాన్ని వెదజల్లుతాం.


ఆత్మ సంబంధమైన దీనమనస్సు తనంతట తానే మన మనస్సుల్లో నాటుకోదు. మనం తగ్గింపు స్వభావం అంటే ఏమిటో అర్థం చేసుకుని, మన ప్రవర్తనలో నమ్రతను అలంకరించుకుని, మన తలపుల్లో దానిని జాగ్రత్తగా పోషించుకుంటూ వస్తే గానీ సాత్వికం మన అంతరంగంలో నిలకడగా ఉండదు.


వినయపూరితమైన ప్రతి లక్షణాన్నీ మొదట మనం గట్టిగా చేపట్టాలి. ఆపైన ప్రార్థనాపూర్వకంగా దాన్ని అలవాటు చేసుకోవడానికి పట్టుదల కలిగి ఉండాలి.


ఇలాటి నమ్రత అలవడడానికి దారి తీసే శ్రమలను చాలామంది ఇష్టపడరు. మనకి సాత్వీకం రావాలంటే ముందుగా మనం చనిపోవాలి. అంటే అహాన్ని నిజంగా విరగొట్టి నలగొట్టేయాలి. అది హృదయాన్ని పిండేసి మనసుని ఆక్రమించుకుంటుంది.


ఈ రోజుల్లో మానసికంగాను, తార్కికంగాను మనం అలవరచుకొనే పరిశుద్దతలు కొన్ని ఉన్నాయి. ఇవి కట్టుకథల్లాటివే. ఇది ఎలాటిదంటే మానసికంగా ఒక అర్పణను బలిపీఠం మీద పెట్టి, అది పరిశుద్ధమైపోయిందని లోలోపల అనుకుని, తద్వారా తాను కూడా పరిశుద్ధుడినై పోయానని తేల్చుకోవడంలాటిది. అలాటి వ్యక్తులు వదరుబోతుల్లాగా తేలిక హృదయాలతో, తేలిక మాటలతో దేవుని రహస్యజ్ఞానాల గురించి కబుర్లు చెప్తూ తిరుగుతుంటారు.


కాని హృదయానికి చుట్టుకున్న సహజమైన తాళ్ళు ఇంకా తెగలేదుఆదాము స్వభావం ఇంకా చూర్ణం కాలేదు. మనసులో గెత్సెమనే మూలుగులు ప్రతిధ్వనించలేదు. కల్వరిలోని నిజమైన మరణపు చిహ్నాలు ముద్రించబడలేదు. అలాటి వారిలో తెరచిన సమాధిలోనుండి హాయిగా మెల్లగా చల్లగా మృదువుగా విజయవంతంగా తియ్యగా నలుదెసలా వ్యాపిస్తూ తేలివస్తున్న జీవం ఉండదు.


Share this post