- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము (కీర్తనలు 37:3).
ఓ సారి ఓ నల్లజాతి స్త్రీని కలిసాను. ఆమె చాలా పేదది. రోజూ కాయకష్టం చేసి పొట్ట పోషించుకొనేది. కాని ఆవిడ సంతోషం, జయజీవితం అనుభవించే క్రైస్తవురాలు. మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో అంది, "సరేగాని నాన్సీ, ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు. అయితే ముందు కాలంలో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాలి మరి"
"ఉదాహరణకి చూడు, నీకు జబ్బు చేస్తుందనుకో, నువ్వు పనిచెయ్యలేక పోతావనుకో, లేకపోతే ఇప్పుడు నువ్వు పనిచేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరు వదలి వెళ్ళిపోతారనుకో, ఇంకెవరూ నీకు పని ఇవ్వరనుకో, లేకపోతే..."
"ఇక చాలండి" నాన్సీ గట్టిగా అంది "నేనెప్పుడూ అలాటివి అనుకోను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏవండీ, ఈ అనుకోవడాలే మిమ్మల్నెప్పుడూ మొహం వేలాడేసుకుని ఉండేలా చేస్తున్నాయి. వాటినన్నిటినీ వదిలిపెట్టి దేవుడి పైన నమ్మకం ఉంచండి"
ఈ అనుకోవడాలూ, ముందేం జరగనున్నదో ఊహించుకుని భయపడడాలన్నింటినీ మన జీవితాల్లో నుండి ఏరిపారేసే ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని చిన్నపిల్లల కుండే విశ్వాసంలాటి విశ్వాసంతో స్వీకరించి, దాన్ననుసరించి ప్రవర్తించాలి. అది హెబ్రీ 13:5,6 "మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి - ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?"
ఆటంకపు నది దారికడ్డమైంది.
లోతుగా, వెడల్పుగా ప్రవహిస్తోంది
అడుగేస్తే మింగేసేలా చూస్తోంది
ఆశతో నిరీక్షణతో నవ్వుతూ పాడుతాను
రేపు రాబోయే కష్టం సంగతి రేపే చూస్తాను
చేతులారా దాన్ని ఈ రోజుకి అరువు తెచ్చుకోను.
రేపు దాటవలసిన వంతెన ప్రమాదకరం
దాని కొయ్య పలకలు ఊగుతున్నాయి
దాని కమ్మీలు కదిలిపోతున్నాయి
రేపు దాటాల్సినదాన్ని గురించి
ఈ రోజు దిగులెందుకు
ఆశ, నిరీక్షణ, నిరంతరం స్తుతిగానం
రేపు రాబోయే దుఃఖం సంగతి
రేపే చూస్తాను, ఈ రోజుకి అరువు తెచ్చుకోను
ఆకాశంలో ఎగిరే పక్షిరాజుకి నదులెలా దాటాలా అనే చింత ఉండదు.