Skip to Content

Day 16 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అప్పుడు పెద్ద తుఫాను రేగెను (మార్కు 4:37)


జీవితంలో కొన్ని కొన్ని తుఫాన్లు హఠాత్తుగా వస్తాయి. ఓ గొప్ప ఆవేదన, భయంకరమైన నిరాశ, లేక అణగ దొక్కేసే అపజయం. కొన్ని క్రమక్రమంగా వస్తాయి. అవి దూరాన కనిపించే మనిషి చెయ్యి అంత మేఘంలా ప్రారంభమై, ఇది చిన్నదే కదా అని అనుకుంటుండగానే ఆకాశమంతా కమ్ముకుని మనల్ని ముంచెత్తుతుంది.


అయితే ఇలాంటి తుఫాను వేళల్లో దేవుడు మనల్ని సేవకు సిద్ధపరుస్తాడు. దేవుడికో దేవదారు వృక్షం అవసరమైతే ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు. పెనుగాలులు దాన్ని వణికిస్తాయి. వర్షం దాన్ని మర్దిస్తుంది. ఈ పోరాటాల్లోనే ఆ చెట్టుకి కావలసిన చేవను అది సంపాదించుకుని అరణ్యం మొత్తానికే రాజవుతుంది.


దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఆయన అతన్ని తుఫానులో నిలబెడతాడు. మనిషి మగతనం సంపాదించుకోవడం చాలా కఠినమైన పరీక్షలతో కూడుకొని ఉంటుంది. మనిషీ ఎవడు తుఫానుకు ఎదురు నిలిచి గెలవకుండా మనిషి అనిపించుకోలేడు. ప్రభూ నన్ను పగులగొట్టు. తిరిగి నీ చేతులతో తయారు చెయ్యి" అని తాను చేసిన ప్రార్థన సార్థకం కాకుండా ఎవడూ పునీతుడు కాలేడు.


ఒక ఫ్రెంచి కళాకారుడు తన అపార మేధా శక్తిని ఉపయోగించి ఒక చిత్రాన్ని గీశాడు. ఆ బొమ్మలో గొప్ప గొప్ప వేదాంతులు, అమరవీరులు, ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ప్రఖ్యాతి గాంచిన మహామహులంతా ఉన్నారు. అయితే ఆ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందడానికి ముందు కష్టాల్లో ఆరితేరినవాళ్లు. ఆ బొమ్మలో అందరికంటే ముందుగా వాగ్దానం వల్ల వారసత్వంగా లభించిన కనానుకు చేరలేకపోయిన మోషే ఉన్నాడు. అతని ప్రక్కన తడుములాడుతూ కళ్ళు లేని హోమర్ మిల్టన్ ఉన్నారు. వీళ్లందరి ప్రక్కన అందరికంటే ఉన్నతుడిగా కనిపిస్తున్న మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ముఖంలో వీరెవ్వరి ముఖంలోనూ కనిపించని బాధ కనిపిస్తున్నది. ఆ కళాఖండానికి "తుఫాను"అనే పేరు సరిగ్గా సరిపోతుంది.


తుఫాను తరువాతే ప్రకృతిలోని అసలు అందం బయటపడుతుంది. పర్వతానికి ఉన్న కరుకు సౌందర్యం తుఫాను సమయంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే మనుషుల్లో మహాత్ములైన వాళ్ళ జీవితాలన్నీ తుఫానుల తాకిడికి రాటుదేరినవే.


నీ జీవితంలో కూడా పెనుగాలులు వీచి (విసిరి) నిన్ను అటూ ఇటూ కొట్టినై. వాటన్నిటి వలన నువ్వు పగిలిపోయి, అలసిపోయి లోయలో మట్టి కరిచావా, లేక ఆ పెనుగాలులు నిన్ను మరింత మెరుగుపెట్టి నీ వ్యక్తిత్వానికి ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టినాయా. తుఫాను తాకిడులకి అలసి సొలసి ఉన్నవాళ్లంటే సానుభూతిని నీలో రేకెత్తించాయా?


దేవుడు నాటిన వృక్షాన్ని

ఏ ప్రభంజనమూ సృజించలేదు

గాలి రేగినా కొమ్మలు ఊగినా

ఆ చెట్టుకు మాత్రం

మరింతపట్టు

భూమి లోతుల్లో వేరుతన్నే

మహా భూజంగా

దేవుని పోషణలో

అది శాఖోపశాఖలై పల్లవిస్తుంది



ప్రభువు గుర్తించే పాదసాన్ని

కదిలించే తుఫాను లేదు

ఉరుములు మెరుపులు

వడిగా కురిసిన పిడుగుల సవ్వడి

ఎంత రేగినా ఏమీ కాదు

దేవుడు నాటిన

దివ్య వృక్షము

నిలకడగా ఉంటుంది

నిత్యం పుష్పిస్తుంది


Share this post