Skip to Content

Day 158 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు . . . నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడు? (యోబు 35:10,11).


నిద్ర కరువైన రాత్రి వేళల్లో బాధపడుతున్నావా, వేడెక్కిన దిండుమీద అటూ ఇటూ పొర్లాడుతూ తూరుపు తెలవారడం చూస్తున్నావా? దేవుని ఆత్మను అర్థించు. నీ తలపులన్నీ నీ సృష్టికర్తయిన దేవుని మీద కేంద్రీకరించమని ప్రార్థించు. ఆ ఒంటరి ఘడియలన్నీ పాటలతో నిండుతాయని విశ్వసించు.


నీ బ్రతుకులో ఎడబాటు రాత్రి కమ్ముకుందా? చాలా సందర్భాల్లో ఇలాటి సమయంలోనే దేవుడు నిన్ను తనకి చేరువగా తీసుకుంటాడు. విలపించే వాళ్ళకి నచ్చజెప్పుతాడు. "చనిపోయిన వ్యక్తి నాకు కావాలి అందుకే తీసుకెళ్ళా" నంటూ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న ఆ ఆత్మను లోకం చెరనుండి విడిపించి, అదృశ్యమైన వెలుగు జనుల మధ్యను, ధగధగ మెరిసిపోతూ, మానవాతీతమైన దివ్యకార్యాలను చెయ్యడంకోసం నిలబెట్టానని చెపుతాడు. ఈ విషయం ఎడబాటు, దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి అవగతమైతే అదే కదా, విజయగీతాలకు నాంది?


నిరుత్సాహం, ఓడిపోతానని భయం, లేక ఓటమి చీకటై నీ బ్రతుకుని అలుముకున్నాయా? నిన్నెవరూ అర్థం చేసుకోరు. స్నేహితులు నిష్టురాలు వేస్తారు. అయితే నీ సృష్టికర్త నీ చెంతకి వస్తాడు. నీ నోటికి ఓ పాటనిస్తాడు. అది ఆశాగీతం. తన చిత్తాన్నీ మహిమనీ ఆ పాటకి లయగా చేస్తాడు. ఆయనిచ్చే ఆ పాటల్ని పాడడానికి సిద్ధంగా ఉండు.


ఆ రాత్రి వచ్చి పడింది, వెలుగు సమసిపోయింది

అంటూ చతికిలబడి చేతులు ముడుచుకుందామా

సంధ్యాకాంతి సాగిపోయింది, దినమంతా కనబడని

సోయగాల తారలు తొంగిచూసి పలకరించాయి


ఓడ ఎంత గట్టిదో తుపాను వస్తేనే తెలుస్తుంది. సువార్త ఎంత లోతుగా వేరుతన్నిందో క్రైస్తవుడికి భరించరాని కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. రాత్రిలో కీర్తనలు పాడడానికి దేవుడు ప్రేరేపించాలంటే ముందుగా రాత్రి రావాలిగదా.


Share this post