- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము (యెషయా 7:10).
అసాధ్యమైనదాన్ని అడుగు
చేయగలడు నీ దేవుడు అసాధ్యం కంటే
అసాధ్యమైనదాన్ని
దేవుని దీవెనల కొట్లమీద దాడి చెయ్యి
అన్నీ ఉన్నాయాయన దగ్గర
ఈ రోజే నమ్మకముంచి వెదికి చూడు.
మనం ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట కనిపెడుతూ ఉండాలి. గొప్ప వర్షపు చప్పుడు వినబడేదాకా ఎదురుచూడాలి. గొప్ప గొప్ప విషయాల గురించి దేవుణ్ణి ఎందుకడగకూడదు. విశ్వాసంతో అడిగితే అందుకు తగిన ధైర్యం, ఓపిక మనకి ఉండి కనిపెట్టగలిగితే తప్పకుండా ఎంత గొప్ప దీవెనైనా మనకి దొరుకుతుంది. ఈ లోపల మనకి చేతనైన పనుల్ని మనం చేస్తూ ఉండాలి.
మనం గాలిని సృష్టించలేం, మన ఇష్టం వచ్చినట్టు దానిని తిప్పలేం. కానీ అది వచ్చినప్పుడు దాని ద్వారా లాభం పొందడానికి మన తెరచాపల్ని ఎత్తగలం గదా. విద్యుశ్చక్తిని మనం తయారుచేయలేం కాని అది ప్రవహిస్తున్న తీగెని అమర్చి దానిచేత పని చేయించవచ్చు. అలానే పరిశుద్దాత్మను మనం శాసించలేం, కాని మనల్ని మనం దేవుని సమక్షంలో నిలబెట్టుకుని ఆయన ఇష్టప్రకారం పనులు చెయ్యడం ద్వారా ఆయన ఆత్మావేశంలోకి రాగలం కదా.
గడిచిపోయిన కాలంలో జరిగినట్టు ఇప్పుడు కూడా అద్భుతాలు ఎందుకు జరగవు? ఏలియా ఎవరికి ప్రార్థించాడో ఆ దేవుడు ఇప్పుడు లేడా? ఉన్నాడు గానీ ఏలియా వంటివాడు తనను పిలవాలని ఆయన ఎదురుచూస్తున్నాడు.
క్రొత్త నిబంధన కాలంలోనేమి, పాతనిబంధన కాలంలోనేమి, బ్రతికి అద్భుతాలు చేసిన పరిశుద్దులు మనకంటే అతీతులూ అసమానులూ కాదు, మనలాటి వారే. ఆత్మీయ ప్రపంచానికి చెందిన ఎలాటి శక్తులు వాళ్ళ ఆధీనంలో ఉండి వాళ్ళనంత ఆత్మశూరులుగా మార్చినాయో, అవే శక్తులు మనకికూడా అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళకున్న నిశ్చయత, ప్రేమ మనకి కూడా ఉంటే వాళ్ళు సాధించినట్టే మనం కూడా ఆశ్చర్యకార్యాలను సాధించగలం. మన నోట్లో కదలాడిన ఒక చిన్న ప్రార్థన వాక్యం దేవుని అగ్నినీ, నేలని తడిపే వర్షాన్నీ దిగి రమ్మన్న ఆజ్ఞే అవుతుంది. ఏలియా వర్షం కోసం, అగ్ని కోసం ప్రార్థించినట్టు మనం కూడా ఒక్కమాట పూర్తి నిశ్చయతతో కూడిన విశ్వాసంతో చెప్పగలిగితే అదెంతో మహిమాన్వితమైన మాటగా ఉంటుంది.