- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
పరిపక్వమైన ధాన్యపు పనలవలె (యోబు 5: 26) (స్వేచ్చానువాదం).
ఒకాయన పాత ఓడలను ఏ భాగానికికాభాగం ఊడతీయడం గురించి చెబుతూ ఉన్నాడు. పాత ఓడలకి వాడిన కలప నాణ్యతను పెంచేది దాని వయసు ఒక్కటే కాదు. ఆ ఓడ సముద్రంలో అలల తాకిడికి గురై ఆటూ ఇటు అల్లాడిన సందర్భాలు, అది మోసిన సరుకులు కూడా దాని కలపను పదును పెడతాయి. ఓడ అడుగున నానబెట్టి సముద్రపు నీటి రసాయనిక చర్య కూడా ఆ కలపను మెరుగుపరుస్తుంది.
కొన్నేళ్ల కిందట దాదాపు ఎనభై ఏళ్ళు సముద్రపు ప్రయాణాలు చేసిన ఒక ఓడను విప్పి దానిలోని దుంగలను, పలుచని చెక్కలను న్యూయార్క్ నగరంలోని ఒక ఫర్నిచర్ షాప్లో ప్రదర్శించారు. వాటి విచిత్రమైన రంగులు మేలి కలయిక, అందరినీ విపరీతంగా ఆకర్షించింది. ఎన్నో సంవత్సరాల సముద్ర ప్రయాణం ఆ కలపలోని సూక్ష్మరంధ్రాలను పూడ్చి, దాని వన్నెను ద్విగుణీకృతం చేసింది. చైనా కళాకారుడు తన ప్రతిభనంతా ఉపయోగించి రూపొందించిన పింగాణి పాత్రకంటే అతి మనోహరమైన, గంభీరమైన రంగుతో అలరారుతున్నది ఆ కలప. ఆ కలపని ఒక అల్మెరాగా తయారు చేశారు. ఈనాడు దాన్నీ న్యూయార్క్లోని ఒక ప్రఖ్యాతి చెందిన భవనంలోని డ్రాయింగు రూములో ఉంచారు.
అలాగే తమ ఇష్టానుసారంగా, స్వార్థంతో ఇతరులెవరికీ ఉపయోగంలేని బ్రతుకు గడిపిన వృద్ధులకి, జీవన సాగరాలను దాటుతూ దేవుని సేవలోనూ, మనుషులకి సహాయపడటంలోనూ ఎన్నో బరువుల్ని మోసిన వృద్ధులకి వాళ్ల గుణ లక్షణాల్లో చాలా తేడా ఉంటుంది.
సూర్యుడు పశ్చిమ దిశలో క్రుంగగానే అంధకారం అలుముకోదు. సూర్యబింబం కనిపించకుండా పోయిన తర్వాత దాదాపు గంట వరకు ఆకాశంలో రంగులు ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి. అలానే మనిషి చనిపోతే ఆయన కనుమరుగయిన తర్వాత చాలా కాలం వరకు ఆయనకు చెందిన కాంతులు ప్రపంచంలో వెలుగుతూనే ఉంటాయి. అలాంటి మనిషి చనిపోతే ఆయన జ్ఞాపకాలు ఈ లోకాన్నివదిలి బయటికి వెళ్లిపోవు. ఆయన వెళ్ళిపోతూ తనదైన ఏదో కొంత వదిలి వెళ్తాడు. చనిపోయి కూడా మాట్లాడుతూనే ఉంటాడు.
ఫ్రెంచ్ వాఙ్మయకారుడు విక్టర్ హ్యూగో 80వ ఏట తన విశ్వాసాన్ని గురించి ఇలా అన్నాడు, "నాతో ఇకపై నేను గడపబోయే జీవితం కదలాడుతూ ఉంది. చాలాసార్లు నరికినా తిరిగి ఏపుగా పెరిగిన అరణ్యంలాగా ఉన్నాను. ప్రతిసారి కొత్తగా పడుతున్న చిగుర్లు అంతకుముందు వాటికంటే ఉప్పొంగుతూ ఉంటున్నాయి. పైపైకి ఎదుగుతున్నాను. సూర్యరశ్మి పైనుండి నన్ను సోకుతున్నది. భూమి నాకు పుష్టికరమైన నా లవణ జలాలను ఇస్తున్నది. కానీ ఆకాశమైతే అనిర్వచనీయమైన కాంతితో నన్ను వెలిగిస్తున్నది.
ఆత్మ అంటే కేవలం శరీరంలోని శక్తులకి సంబంధించినదే అంటారు మీరు, అలాగే నా శారీరక శక్తులు ఉడిగిపోతున్న కొద్దీ నా ఆత్మ మరిన్ని కొత్త కాంతుల్ని సంతరించుకుంటున్నదేమిటి? నా తలపైన శీతాకాలం వచ్చి పడింది. నా హృదయంలో మాత్రం నిత్యం వసంతరుతువు నెలకొని ఉంది. నేను యువకుడిగా ఉన్నప్పటిలాగా ఇప్పుడు కూడా గులాబీలు, గరికపూలు మొదలైన పుష్పాల సౌరభాన్ని వాసన చూసి అందించగలుగుతున్నాను. అంతం సమీపిస్తున్న కొద్దీ నా చుట్టూ పరలోకపు ఆనంద గానాల ధ్వని నన్ను ఆహ్వానిస్తూ మరింత స్పష్టంగా వినబడుతున్నది. ఇది అద్భుతం, అదే సమయంలో అతి సాధారణం.