- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
భూలోకంలోనుండి కొనబడిన ఆ నూటనలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు (ప్రకటన 14: 3).
బాధల లోయలో ఉన్నవాళ్లకు మాత్రమే కొన్ని పాటలు నేర్చుకోవడానికి వీలవుతుంది. ఎంత గాన ప్రావీణ్యం ఉన్నా ఇలాంటి పాట నేర్చుకోవడానికి రాదు. స్వరంలో ఎంత శ్రావ్యత ఉన్న ఇతరులు దీన్ని సరిగా పాడలేరు. దీని సంగీతం హృదయములోనుండే వస్తుంది. ఇది వ్యక్తిగతమైన అనుభవాల్లో పుట్టి కంఠస్థం అయిపోయిన పాట. గడిచిన కాలపు అంధకార భారాన్ని తలపుకి తెచ్చేపాట ఇది. నిన్నటి కాలపు రెక్కలు కట్టుకొని పాట ఈ రోజులోకి ఎగిరి వస్తుంది.
పరిశుద్ధుడైన యోహాను రాస్తున్నాడు, పరలోకంలో కూడా ఒక పాట ఉంటుందట. విమోచింపబడిన మానవులే ఆ పాట పాడగలరట. ఇది నిస్సందేహంగా విజయగీతమే. మనల్ని విముక్తులను చేసిన యేసు క్రీస్తు విజయాన్ని గురించిన పాట. అయితే ఆ విజయోత్సవం అందరికీ కలగాలంటే కలగదు. ఒకప్పుడు గొలుసులతో బంధింపబడి ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నవారిదే విజయోల్లాసం.
నేను ఈ పాటను పాడినట్టుగా ఏ దూతగాని, ప్రధానదూత గాని పాడలేడు. నేను పరదేశిగా ఉన్నట్టు ఆ దేవదూతలెప్పుడూ ఉండలేదు. సిలువలో విమోచింపబడ్డవారు తప్ప మరెవరు ఈ పాటను నేర్చుకోలేరు. నా ఆత్మ తండ్రి దగ్గరినుండి ఈ సంగీతపాఠం నేర్చుకుంటున్నది. కంటికి కనిపించని సంగీత బృందంతో కలిసి శిక్షణ పొందుతున్నది. ఈ సంగీత సమ్మేళనంలో కొన్ని భాగాలను నా ఆత్మ తప్ప మరెవరూ పలకలేరు. దేవదూతలకి ఈ శ్రుతి కుదరదు. ఈ తాళాలను నాఆత్మ మాత్రమే వేయ్యగలదు, ఆలపించగలదు.
దేవదూతలాలపించలేని ఆ భాగాలను ఆలపించడం కోసం తండ్రి నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నిన్ను పరీక్షించడానికి దేవుడు నీపైకి బాదల్ని పంపిస్తుంటాడని చెప్తుంటాడు. కాదు, నీకు నేర్పించాదానికే ఆయన ఆ బాదల్ని నీపైకి పంపుతుంటాడు. రమ్యమైన ఆ గాయక బృందంలో నువ్వు ఉండడం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు.
రాత్రి సమయాల్లో నీ పాటను సిద్ధం చేస్తున్నాడు. కొండలోయల్లో నీ స్వరాన్ని పదును పెడుతున్నాడు. మేఘాలు కమ్మిన వేళ నీ శృతిని సవరిస్తున్నాడు. వర్షాలు కురుస్తున్నప్పుడు నీ స్వరంలోని మాధుర్యాన్ని పరిపక్వం చేస్తున్నాడు. చలిరోజుల్లో నీ భావాన్ని మలుస్తూ ఉన్నాడు. ఆశాజనకమైన సమయాలనుంచి భయంలోకి నువ్వు దిగజారే వేళ్ళల్లో నీ లయను సరిచూస్తున్నాడు.
నా అంతరంగమా, ఈ వేదనల బడిని అసహ్యించుకోకు. అందులో నువ్వు పొందిన శిక్షణే రాబోయే కాలంలో పరలోకంలో వినిపించబోయే సార్వత్రికమైన రాగంలో నీ వంతు నువ్వు పాడగలగాడానికి సహాయపడుతుంది.
కాళరాత్రి నిలువునా కమ్ముతున్నదా కటిక చీకటి కర్కశంగా కప్పుతున్నదా చేర రమ్మని ఆయన్ని చనువుగా ఆహ్వానించు కొత్తపాట, కోయిలపాట నీకిస్తాడు సుతారంగా నీతో శృతి కలుపుతాడు శోధనలో సొమ్మసిల్లిన నీస్వరం ఆగితే ఆగిన పాటను ఆగనీయకుండా ఆ మేఘాల్లో తన పాటతో లీనం చేస్తాడు.
ఆ పాట పాడే ప్రకాశ పుత్రులంతా ముక్తకంఠంతో ముకుళిత హస్తాలతో ఆ అంధకారంలోనే ఈ అపురూపగానం మాకు అలవడిందంటూ మురిసిపోతారు తండ్రి ఇల్లంతా మధుర పరిమళంలాగా అలుముకునే ఆ అసమాన గీతం పుట్టి ప్రాణం పోసుకున్నది పగటి వెలుగు చూడని పూరిపాకల్లోనే.