Skip to Content

Day 147 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

వాటిని నా యొద్దకు తెండి (మత్తయి 14: 18).


ఈ క్షణాన నువ్వు ఎంతో అవసరంలో ఉన్నావా? కష్టాలు శోధనలు ముంచుకొస్తున్నాయా? ఇవన్నీ పరిశుద్ధాత్మ నిండడం కోసం దేవుడు నీకు అందిస్తున్న గిన్నెలు. నువ్వు వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే, అవే నీకు కొత్త కొత్త ఆశీర్వాదాలను తెచ్చి పెట్టే అవకాశాలు అవుతాయి. ఇంకోరకంగా ఆ ఆశీర్వాదాలు దొరికేవి కావు.


ఈ గిన్నెలను దేవుని దగ్గరికి తీసుకెళ్లండి. విశ్వాసంతో ప్రార్థనలో ఆ గిన్నెలను దేవుని ఎదుట పెట్టండి. నిశ్చలంగా ఓపికగా కనిపెట్టండి. ఆయన తన పనిని ప్రారంభించేదాక మీరే పని మొదలు పెట్టవద్దు. దేవుడు తనకై తాను మీకు ఆజ్ఞాపిస్తే తప్ప ఏ పని చేయవద్దు. ఆయనకి తన పని చేసే అవకాశం ఇవ్వండి. ఆయన తప్పకుండా చేస్తాడు. "మిమ్మల్ని నిరాశ నిస్పృహలతో ముంచెత్తబోయిన శోధనలే దేవుడు మీ జీవితాలలో తన కృపను, మహిమను ప్రసరింపజేయడానికి ఆయనకి అవకాశమిస్తాయి. ఇలాంటి అనుభవం ఇంతకు ముందు ఎన్నడూ మీకు తెలిసిన అనుభవాల లాంటిదికాదు. వాటిని (మీ అవసరాలను) నా యొద్దకు తెండి.


"కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును" (ఫిలిప్పీ 4: 19).


"దేవుడు" ఆయనలో దొరకనిది లేదుకదా!" "ఆయన ఐశ్వర్యములోని మహిమ" ఎంత తీసుకున్నా తరిగేది కాదుగదా!" "యేసుక్రీస్తు" - ఎన్ని ఇచ్చిన ఇక చాలించడు గదా! నీ అవసరాలనన్నింటిని ఆయన ఐశ్వర్యంలో నుంచి తీసుకోవడం అన్నది ఎంత మహాభాగ్యం! ఆ ఐశ్వర్యాలన్నీ మన కంటబడినప్పుడు మన పేద అవసరాల మాటే మర్చిపోతాము. మితిలేని ఆయన సంపద అంతా నీదే. ఆ ధనాగారాల తలుపులు నీకోసం బార్లాగా తెరిచాడు. ఆయన హృదయంలో నీ మీద ఉన్న ప్రేమ వలన, అమాయకమైన విశ్వాసంతో వెళ్లి ఆ బొక్కసంలో నుండి ధనరాసులు తెచ్చుకో. ఇక మరెన్నడూ మనుషుల ధనానికి ఆశించవు. మనుషుల మీద ఆధారపడవు.



నా గిన్నె నిండి పోర్లుతున్నది


కృపగల క్రీస్తుని కోరుకుంటే కోరినవన్నీ నిండి పొర్లుతాయి ఆయన నింపిన ప్రతి గిన్నె అంచులు దిగజారి కారుతుంది ఆయన నదులు ఉండవెప్పుడు ఎండిపోయి, జీవం తప్పి, ఆయన సమృద్ధిలో నుండి వచ్చేది తరగదు ఎప్పుడు తన వారికి ఇస్తాడాయనెప్పుడు పుష్కలంగా, అంచులు దిగజారేలా


తండ్రి చేతుల నుండి మనకి కావలసింది స్తుతులతో మనం కోరుకుంటే మన పాత్ర నిండి పొర్లుతుంది


ఆయన చేసిన బాటను స్తుతులతో అనుసరిస్తే మనసంతా నిండిన సంతృప్తి గుండెలో పండి కళ్ళకి వెలుగునిస్తుంది హృదయం క్రీస్తును నమ్మితే దానికి ఉండవు అవసరాలిక


సర్వం నిండిన ఆయన ప్రేమను సర్వజనాలకు స్వరమెత్తి చెప్తే మన గిన్నె నిండి పొర్లుతుంది అందరి శిఖరాలు, అంతులేని అగాధాలు మనసుకు అర్థం కాని దేవుని ఆపేక్ష తెలియవు మనిషి తెలివికి కలకాలం ఆయన స్తుతిలో ఆశ్చర్యంలో కాలం గడపడమే మనకి తెలిసిన కలిమి.


Share this post