- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
బావీ ఉబుకుము. దాని కీర్తించుడి (సంఖ్యా 21: 17).
ఇది చాలా వింతైన పాట. ఇది వింతైన భావి, ఇజ్రాయేలీయులు ఎడారి దారుల్లో నడిచి వస్తున్నారు. కనుచూపు మేరలో నీళ్లులేవు, దాహంతో నోరెండిపోతున్నది. అప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు.
"ప్రజలను సమకూర్చు, నేను వాళ్ళకి నీళ్ళిస్తాను" ఇసుక తిన్నెలమీద చుట్టూ నిలబడ్డారు జనమంతా. తమ కర్రలతో మలమల మాడిపోతున్న ఇసుకలో లోతుగా తవ్వారు. తవ్వుతూ పాటపాడారు.
"బావి ఉబుకుము, దానిని కీర్తించుడి." చూస్తుండగానే బుడబుడమని శబ్దంతో నీళ్ళు పైకి ఉబికి ఆ గుంటను నింపి పొర్లిపారినాయి.
వాళ్లు ఎడారిలో నేలను త్రవ్వారు, అలా త్రవ్వుతూ భూగర్భంలో పరుగులెడుతున్న ప్రవాహం వరకు వెళ్లారు. ఎంతోకాలంగా కంటికి కనిపించని ప్రవాహాలను చేరుకున్నారు.
ఇది ఎంత మనోహరమైన దృశ్యం! ఆశీర్వాదపు ఊటలు మన జీవితపు ఎడారుల్లో మన కంటికి కనిపించకుండా ఎక్కడో లోతున ప్రవహిస్తూ ఉంటాయట. మనం విశ్వాసంతోనూ, స్తుతి కీర్తనలతోను త్రవ్వుతూ వెళ్లగలిగితే, ఎండిన ఎడారుల్లో కూడా మన అవసరాలకు ఏమి లోటు ఉండదు.
మీ ఊటలోని నీళ్లను వాళ్ళు ఎలా బయటకు తీస్తారు? స్తుతి పాటల ద్వారా తమ విశ్వాసగీతాలు ఆ ఇసుకపై పాడారు, వాగ్దానాలనే దుడ్డుకర్రలతో ఆ బావిని త్రవ్వారు.
మన స్తుతికి ఎడారుల్లోని ఊటల్ని తెరిచే శక్తి ఉంది. సణుగుడు అయితే మన మీదికి తీర్పు తెస్తుంది. ఒక్కోసారి ప్రార్థన కూడా ఆశీర్వాదాల ఊటల్ని విప్పెశక్తిని కోల్పోతుంది.
స్తుతి తప్ప దేవుణ్ణి సంతోషపెట్టేది మరొకటి లేదు. కృతజ్ఞతలు చెప్పగలగడమే అన్నిటి కంటే కఠినమైన విశ్వాస పరీక్ష. నువ్వు చాలినంతగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? అసంఖ్యాకంగా నీపై కురుస్తున్న కంటికి కనిపించే ఆశీర్వాదాలకై దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నావా? శ్రమలలాగా కనిపిస్తూ వాస్తవానికి ఆశీర్వాదాలయిన వాటికై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విశ్వాసం నీకుందా? నీకింకా అనుగ్రహించబడని దీవెనల కోసం ముందుగానే స్తుతించడం నేర్చుకున్నావా?
విడుదలకోసం వేచియున్నావా నా హృదయమా, ఎంతో కాలంగా నీ విడుదల నీ స్తుతి పాటల్లోనే వేచి ఉంది తెలుసా నీకు.
నిట్టూర్పుకు విడుదల ఎంతో దూరం లేదు కట్టిన నీ కాళ్ల గొలుసులు ఇట్టే విడిపోతాయి విమోచన గీతాలతో ప్రభువు నిన్ను ముంచెత్తుతాడు.