Skip to Content

Day 144 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను (ఆది 21: 2).


"యెహోవా ఆలోచన సధాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును" (కీర్తన 33: 11). అయితే దేవుడు అనుకున్న సమయం వచ్చేదాకా మనం వేచియుండటానికి సిద్ధపడాలి. దేవుడికి కొన్ని నిర్ణీతమైన సమయాలున్నాయి. ఎప్పుడు, అనేది మనకు తెలియని మర్మం. మనకవి తెలియవిగాని ఆ సమయాల కోసం మనం ఎదురుచూడాల్సి ఉంది.


అబ్రహాము హారానులో కాపురం ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మరో 30 యేళ్లకి నీకు కొడుకు పుడతాడు అని చెప్పినట్లయితే అబ్రహాము అంతకాలం కనిపెట్టాలి కాబోలు అనుకుని నిరుత్సాహపడేవాడే. కానీ దేవుడు తన ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబడి కనిపెట్టడాన్ని అబ్రహాముకి లేకుండా చేసి, ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంకా కేవలం నెలల గడువు ఉందనగా అబ్రాహాముతో చెప్పాడు. "ఈ కాలమున, నిర్ణయకాలమందు ... శారాకు కుమారుడు కలుగుననెను" (ఆది 18: 14).


నిర్ణయకాలం ఎట్టకేలకే రానేవచ్చింది. ఆ ఇంట్లో పసివాడి నవ్వులు కేరింతలు వింటూ ఆ ముసలి దంపతులు గతకాలమంత తాము పడిన తమ మనస్తాపాన్ని మర్చిపోయారు.


కళ్ళు కాయలు కాసేలా కనిపెట్టే క్రైస్తవుడా, నిరుత్సాహపడకు. నువ్ఎవరికోసమైతే కనిపెడుతున్నావో ఆయన నిరాశపరిచేవాడు కాడు. తాను నియమించిన సమయానికి ఐదు నిమిషాలు కూడా ఆలస్యం చేయడు. శ్రీఘ్రంగానే నీ విచారణ ఉత్సాహంగా మారుతుంది.


దేవుడు నిన్ను ఆనందంతో ముంచెత్తినప్పుడు ఎంత దీవెనకరమైన స్థితి అది! సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచలైనట్టే ఆ సమయం వచ్చేసరికి విచారం, ఏడుపు దూరంగా పారిపోతాయి.


మనం ప్రయాణికులమే, ప్రయాణపు చిత్రపటాలను, దిక్సూచిని కెలకడం మనకి తగదు. సర్వం తెలిసిన మన పైలెట్ ఆ వ్యవహారమంతా చూసుకుంటాడు.


కొన్ని పనులు ఒక్కరోజులో అయిపోవు. సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో సాక్షాత్కరించే వింత రంగులు ఒక్క క్షణంలో తయారయ్యేవి కావు.


ఓ శుభదినాన బండరాళ్లు చదువు అవుతాయి ఏ రోజుది? ఎవరికి తెలుసు నెర్రలు విచ్చిన నేల నీరు తాగుతుంది నిండుగా అడ్డుగడియలు విరుగుతాయి తలుపులు తెరుచుకుంటాయి


కఠినమైన చోట్లు సాఫీ అవుతాయి వంకర దారులు తిన్నగా అవుతాయి ఓపికగా కనిపెట్టే హృదయమున్నవాడికి జరుగుతాయి ఇవన్నీ దేవుడు నిర్ణయించిన గడియల్లో అది రేపోమాపో ఎవరికి తెలుసు తెలిసిందల్లా తప్పక జరుగుతాయని.


Share this post