Skip to Content

Day 14 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

24 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అతడు తన సొంత గొర్రెలనన్నిటిని వెలుపలికి నడిపించును (యోహాను 10: 4).


ఆయన ఈ పని చాలా అయిష్టంగా చేస్తున్నాడనుకుంటాను, ఆయన గొర్రెలమైన మనకీ ఇది కష్టాలు తెచ్చి పెట్టే విషయమే. కాని ఇది జరగక తప్పదు. మనం నిజంగా వర్థిల్లాలంటే సంతోషంగా, సౌకర్యంగా గొర్రెలదొడ్డిలోనే ఎప్పుడూ ఉండపోవడం తగదు. దొడ్డి ఖాళీ అయిపోవాలి. గొర్రెలు కొండ చరియల్లో తిరగాలి. పనివాళ్ళు పంట నూర్చడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే పండిన పంట పాడైపోతుంది.


నిరుత్సాహపడవద్దు, ఆయన నిన్ను బయటికి పంపిస్తుంటే లోపలే ఉంటాననడం మంచిది కాదు. ప్రేమించే ఆయన చెయ్యి మనల్ని బయటికి తోలుతుందంటే అది మన మంచికే. ఆయన నామం పేరిట పచ్చిక బయళ్లలోకి, సెలయేళ్ళ ఒడ్డుకి, పర్వత శిఖరాల పైకి వెళదాం రండి. మీకు ముందుగా ఆయన నడుస్తాడు. మనకోసం ఏ ఆపద కాచుకొని ఉందో అది ముందు ఆయన కంట బడుతుంది. విశ్వాసంగల హృదయానికి ముందు దారి తీస్తూ వెళ్తున్న ప్రభువు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. కాని అలా ఆయన మన ముందు లేనప్పుడు వెళ్ళడం ప్రమాదకరం. నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నింటిలోకి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకోండి. నీ పాదాలకి ఆ దారులు నువ్వు భరించలేనంత బాధ కలిగిస్తాయను కుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పడు.


ఎప్పుడో భవిష్యత్తులో ఏమవుతుందో అని ఆందోళన చెందకపోవడం, తరువాతి అడుగు ఎక్కడ వెయ్యాలి అని కంగారు పడకపోవడం, దారిని మనమే నిర్ణయించు కోవాలని తాపత్రయం లేకపోవడం, రాబోయే కాలంలో మనం వహించబోయే బాధ్యత గురించిన చింత లేకపోవడం, ఇవన్నీ ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు. అలాటి గొర్రె తన కాపరి వెనుక ఒక్కొక్క అడుగు వేస్తూ సాగిపోతుంది.


రేపేం జరుగుతుందో తెలియదు

బ్రతుకు బాటలో వేకువింకా కాలేదు

నా నేత్రాలు గమ్యాన్నింకా చూడలేదు

నా ముందు ఆయన నడుస్తున్నాడు

అందుకుమాత్రం సందేహం లేదు


ప్రమాదాలు వస్తున్నాయి, భయాలు ఎదురవుతున్నాయి

జీవితంలో ఏం రాసి పెట్టి ఉందోనని

మనసులో వణుకు పుట్టుకొస్తున్నది

కాని నేనాయనవాణ్ణి, నాదారి ఏదైనా

నాముందు ఆయన వెళ్తున్నాడు


జీవితంలో ఇక ఆనందాలేమీ లేవంటూ

సందేహాలు మదిలో నీడలు పరుస్తున్నాయి

ఆయన హక్కు తప్ప నన్ను బలపరిచేది ఏది?

యన్ని వెంబడిస్తున్నానన్న దానికంటే

ధన్యకరమైన నిశ్చయత ఏది?


నా ముందుగా ఆయన వెళ్తున్నాడు

దీనిమీదే నా మనసు నిలుపుకున్నాను

నా రక్షణకి అభయం ఇదే

నాకు ముందుగా ఆయన వెళ్తున్నాడు

ఇక నాకంతా క్షేమమే


కాపరులెప్పుడూ గొర్రెలమందకి ముందుగానే నడుస్తారు. ఏదైనా మందమీద దాడి చేయ్యాలనుకుంటే కాపరిని ఎదుర్కోవలసి ఉంటుంది. మనకి దేవుడే ముందుగా నడుస్తున్నాడు. మనకి రాబోయే "రేపు"లో దేవుడిప్పుడే ఉన్నాడు. ఆ "రేపు" గురించే మనుషులంతా దిగులు పెట్టుకునేది. గాని దేవుడు మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడు. ఆ రేపు ముందు ఆయన్ని దాటుకోగలిగితేనే మన మీదికి రాగలిగేది.


దేవుడు ప్రతి రేపటిలో ఉన్నాడు

నేను ఈ రోజు కోసమే బ్రతుకుతాను

దారిలో ఉషోదయం నడిపింపు

తప్పకుండా దొరుకుతుందన్న తపనతో

ప్రతి బలహీనతని భరించే సత్తువ


ప్రతి దుఖాన్ని గెలిచేందుకు నిబ్బరం

వర్షించిన తరువాత హర్షించే సూర్యరశ్మి

ఆయనిస్తాడన్న నిత్య నిరీక్షణతో

ఈ రోజు కోసమే బ్రతుకుతాను


Share this post