- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన నా మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పారసీకులు రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములలో నన్ను ఎదిరించెను (దానియేలు 10: 12,13).
ఇక్కడ ప్రార్థన గురించి మంచి పాఠం మనం నేర్చుకోవచ్చు. ప్రార్ధనను నేరుగా సైతాను అడ్డగిస్తాడని స్పష్టంగా రాసి ఉంది.
దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థనలో చాలా శ్రమించాడు. అయితే ఇక్కడ రాయబడిన దాని ప్రకారం అతనికి వెంటనే జవాబు రాకపోవడానికి కారణం, దానియేలు యోగ్యుడు కాదని కాదు, అతని ప్రార్థన సరైనది కాదని కాదు, సైతాను అడ్డగించిననందువలన.
నిజానికి దానియేలు ప్రార్థించడం మొదలు పెట్టగానే అతనికి జవాబు ఇవ్వడానికి దేవుడు తన దూతలు పంపించాడు. అయితే ఒక దుష్టశక్తి ఆ దూతను ఎదుర్కొని అడ్డగించి దూతతో పెనుగులాడింది. పరలోకంలోనే ఆ పెనుగులాట జరిగింది. అక్కడ పోరాటం జరుగుతున్నంతకాలమూ ఇక్కడ భూమి మీద దానియేలు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు.
"ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అధికార సంబందులగు లోకనాధలతోనూ, ఆకాశమండలమందున్న దురాత్ముల సమూహాలతోను పోరాడుచున్నాము. "పూర్తిగా మూడు వారాలపాటు దానియేలకు జవాబు రాకుండా సైతాను అడ్డుపడగలిగాడు. దానియేలు దాదాపుగా ఆశ వదిలేసుకున్నాడు. దానియేలును పూర్తిగా అణగద్రొక్కేయాలని సైతాను అనుకుని ఉండవచ్చు. అయితే మనం భరించగలిగిన దానికంటే ఎక్కువ శోధన మన మీదికి రానివ్వడం దేవునికి ఇష్టం లేదు.
చాలా మంది క్రైస్తవుల ప్రార్ధనలు సైతాను మూలంగా నిర్వీర్యం అవుతూ ఉంటాయి. అయితే మీ విశ్వాసం, ప్రార్థనలు అలా పేరుకుపోతుంటే మీకే లాభం. ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదలాగా ప్రవహించి జవాబుని లాక్కోస్తాయి. అంతేకాక అదనంగా కొన్ని ఆశీర్వాదాలు వాటితో పాటు కొట్టుకొస్తాయి.
అంధకార శక్తి పరిశుద్ధులకి తాను చేయగలిగిన హాని అంతటిని చేస్తుంది. అయితే ఎక్కువ వత్తిడిలు, శోధనలు సహించిన ఆత్మే అతి విలువైనదిగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి వారిని పరలోకం నిర్లక్ష్యం చెయ్యదు.