Skip to Content

Day 135 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఎప్పుడు కనబడకయున్నను..... (యోబు 37: 21).


మేఘ ప్రపంచం లేకపోతే మన ప్రకృతికి అందం లేదు. ఇటలీ ప్రాంతంలో ఆకాశం ఎప్పుడు మేఘం లేకుండా బోసిగా ఉంటుందట. క్షణ క్షణానికి ఆకారాలు మారుతూ ఆకాశంలో హుందాగా తేలే మేఘాలకు ఉన్న అందం కాళీ ఆకాశానికి ఎక్కడ వస్తుంది? మేఘాల్లేకపోతే భూమంతా ఎప్పుడో ఎడారిగా మారి ఉండేది. మానవ జీవితంలో కూడా మేఘాలుంటాయి. నీడనివ్వడానికి, సేదదీర్చడానికి, ఒక్కోసారి చీకటి కమ్మించటానికి అవి కూడుకుంటూ ఉంటాయి. తేజోవంతమైన కాంతిలేని మేఘాలుండవు. దేవుడే అన్నాడు "నా ధనస్సును మేఘాల్లో ఉంచాను."


మనక్కనిపించే వైపునుండి కాక రెండోవైపునుంచి మనం మేఘాలను చూసినట్లయితే రవికిరణాలతో ప్రోక్షించబడుతూ గొప్ప పర్వతశిఖరాల్లాగా కాంతిని ప్రసరింపజేస్తూ కనిపించే మేఘాల దృశ్యం నిరుపమానమైనది.


మనమెప్పుడు వాటిని క్రిందనుంచే చూస్తాము. అయితే వాటి శిఖరాలను, లోయలను స్పృశిస్తూ తడుపుతూ నాట్యం చేసే ఉజ్వల కాంతిని ఎవరు వర్ణించగలరు?


దైవకుమారుడా, నీకు సంభవించే శ్రమలను అవతలి వైపు నుండి చూడగలిగితే ఎంత బాగుంటుంది! కిందనుండే ఎప్పుడూ చూస్తున్నావు. నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నత స్థలాల్లో కూర్చుని క్రింద ఉన్న మేఘాలను చూడగలిగితే, పరలోకపు స్వచ్చమైన ధవళ కాంతిని, క్రీస్తు ముఖకాంతిని అవి ప్రతిబింబిస్తున్నాయన్న సత్యాన్ని కళ్ళారా చూడగలిగితే ఎంత మంచిది! అవి నీ జీవితం పైన దీర్ఘమైన నీడల్ల్ని సృష్టిస్తున్న నువ్వేమి నిరుత్సాహపడవు. ఒక్కటి గుర్తుంచుకో, అన్నింటినీ తొలగించే శుభ్రపరిచే దేవుని గాలులు ఈ మేఘాలను కదిలిస్తే విడగొడుతూ ఉంటాయి.


ఉన్నట్టుండి గట్టిగా ఈ గాలివాన పట్టుకొని కోపంతో అటు ఇటు కొట్టింది ఎందుకో నా దారులైతే దేవునికి తెలుసు నమ్మకం ఉంచడం మంచిదని నాకు తెలుసు.


కాలజ్ఞాన గూఢ ముసుగును తొలగించి తొంగి చూడలేను ఉదయము చీకటి ఏది పొంచి ఉందోగాని, సదయునిపై నమ్మకం ఉంచాను.


ఆటుపోటుల కావల రేవుందో లేదోనని నీటిఅలలను దాటి చూచే కళ్ళు లేవు. నాటికి నేటికి దేవుడు నాతోడని పాట పాడే నమ్మకం మాత్రం ఉంది.


Share this post