- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
నమ్మువానికి సమస్తమును సాధ్యమే. (మార్కు 9: 23).
ఈ "సమస్తమును" అనేది ఊరికే లభించదు. ఎందుకంటే విశ్వాసం అనే మార్గాన్ని మనకి బోధించాలని దేవుడు ఎప్పుడు తహతహలాడుతున్నాడు. మనం ఇలా విశ్వాసమనే బడిలో చదువుకునేటప్పుడు విశ్వాసానికి పరీక్షలు కూడా ఉంటాయి. విశ్వాసంలో క్రమశిక్షణ, విశ్వాసంలో సహనం, విశ్వాసంలో ధైర్యం, ఇలా ఎన్నెన్నో మెట్లెక్కితేగాని విశ్వాసపు తుదిమెట్టుకి రాము. ఈ తుదిమెట్టు విశ్వాసంలో జయం.
నైతికమైన సారం విశ్వాసమూలంగానే వస్తుంది. దేవుని నువ్వు అర్ధించావు. కానీ జవాబు లేదు. ఏం చెయ్యాలి? దేవుడి మాటలని నమ్మడం మానోకోకూడదు.నీకు కనిపించే వాటిని, అనిపించే వాటిని ఆధారంగా చేసుకుని దైవవాగ్దానాలనుండి తొలగిపోకూడదు. ఇలా స్థిరంగా నిలిచి ఉంటే విస్తారమైన శక్తి అనుభవాలు నీలో పోగవుతాయి. దేవుని మాటకు వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలను చూస్తూ కూడా విశ్వాసపీఠం మీద చలించకుండా ఉన్నప్పుడు నువ్వు బలపడతాయి.
ఒక్కోసారి దేవుడు కావాలనే ఆలస్యం చేస్తాడు. ఈ ఆలస్యం ఉన్నది కూడా నీ ప్రార్థనలకి జవాబులాంటిదే. నీ విన్నపము నెరవేరడం ఎలాంటిదో ఆలస్యం కావడము అలాంటిదే.
బైబిల్లోని భక్తి శిఖామణులందరి జీవితాల్లోనూ దేవుడు ఇలానే పనిచేశాడు. అబ్రహాము, మోషే, ఏలియా మొదలైన వాళ్ళు ప్రారంభంలో గొప్పవారేమీ కాదు. కానీ విశ్వాస సౌర్యంవల్ల గొప్ప వాళ్ళయ్యారు. ఈ మార్గం ద్వారానే దేవుడు వాళ్లకి నియమించిన మహత్తర కార్యాలను ఇక్కడ తీర్చగలిగారు.
ఉదాహరణకి దేవుడు యోసేపును ఐగుప్తు సింహాసనం ఎక్కించడానికి సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, దేవుడతన్ని పరీక్షించాడు. అతన్ని పరిశోధించినవి కారాగారంలోని కటికనేల మీద నిద్ర, చాలీచాలని తిండి కావు. దేవుడే ప్రారంభంలో అతనికి దక్కబోయే అధికారం ప్రతిష్టతల గురించి, అతని అన్నలకంటే తాను ఘనుడవుతాడని అతనికి చెప్పాడు. ఈ వాగ్దానమే అన్ని సంవత్సరాలు అతని మనసులో ఉంది. అయితే అతను ముందుకు వెళుతున్న కొద్దీ అడుగడుక్కీ ఈ వాగ్దానం నెరవేరే సూచనలు కనుమరుగైనాయి. చివరికి చెయ్యని నేరానికి జైలుపాలయ్యాడు. బహుశా నేరం చేసి బంధించబడిన నేరస్తులు ఒక్కొక్కరే విడుదలై వెళ్ళి పోతూ ఉంటే యోసేపు మాత్రం చెరసాలలోనే మగ్గిపోయాడు.
అక్కడ ఒంటరితనంలో గడిచిన ఆ గడియలే అతన్ని పదును పెట్టినాయి. అవి ఆత్మాభివృద్ధి కలుగజేసే ఘడియలు. చివరికి అతని విడుదలకి ఆజ్ఞ వచ్చినప్పుడు, తన అన్నలతో ఎలా వ్యవహరించాలన్న జ్ఞానం అంతా అతనికి అబ్బింది. దేవునిలో తప్ప మరెక్కడా కనిపించని ఓర్పు, ప్రేమ అతనిలో నిలిచాయి.
ఇలాంటి అనుభవాలు మనకి నేర్పేటంత శ్రేష్టమైన పాఠాలు మరి ఎక్కడ నేర్చుకోలేము. ఒకసారి దేవుడు ఒక పని చేస్తానంటూ పలికి రోజులు గడిచిపోతున్న ఆయన దాన్ని చేయకుండా ఉంటే అది మనకి కష్టంగానే ఉంటుంది. అయితే విశ్వాసంలో క్రమశిక్షణ నేర్చుకుని దేవునికి సంబంధించిన జ్ఞానాలు పెంపొందించుకోవడానికి ఇదే మార్గం. మరే విధంగానూ ఇది సాధ్య పడదు.