- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను (ఆది 18: 22).
దేవుని స్నేహితుడు కాబట్టి ఇతరుల గురించి దేవునితో వాదించగలడు. అబ్రహాములో మూర్తీభవించిన విశ్వాసం, దేవునితో స్నేహం మన స్వల్ప అవగాహనకి అందదేమో. అయినా దిగులు పడాల్సిన పనిలేదు. అబ్రాహాము విశ్వాసంలో క్రమంగా ఎదిగినట్టే మనము ఎదగవచ్చు. అబ్రహాము తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగాడేగాని ఒక్కసారి ఒక్క గంతలో అంత విశ్వాసాన్ని అలవర్చుకోలేదు.
ఎవరి విశ్వాసమైతే పరీక్షలకూ శోధనలకు గురవుతుందో, ఆ శోధనలో ఏ మనిషయితే విజయం సాధిస్తాడో ఆ మనిషికి అంతకన్నా కష్టతరమైన పరీక్షలు ఎదురవుతాయి.
వెలగల రాళ్లను అతి జాగ్రత్తగా చెక్కి పదును పెడతారు. లోహం ఎంత విలువైనదైతే అంతవేడిమి గల కొలిమిలో దాన్ని శుద్ధి చేయాలి. అబ్రహాము అతి జటిలమైన పరీక్షలను ఎదుర్కొని నిలబడకపోయి ఉన్నట్లయితే ఆయన్ని విశ్వాసులకి తండ్రి అని పిలిచేవారు కాదు. ఆదికాండం 22 వ అధ్యాయం చదవండి.
"నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని..." - మోరియా కొండల్లో మ్లానవదనంతో, నమ్రతతో కొడుకువంక బేలగా చూస్తూ ఎక్కిపోయే ఆ వృద్ధుడిని ఓసారి ఊహించుకోండి. తాను నమ్మకంగా ప్రేమించి సేవిస్తూ వస్తున్న తన దేవుని ఆజ్ఞమేరకు, తన బంగారుకొండ తనకొడుకు తన పక్కనే బలిగా చనిపోవడానికి నడుస్తూ వస్తుంటే ఆయనలో ఏ భావాలు చెలరేగాయో ఎవరికి తెలుసు?
దేవుడు మన జీవితాల్లో జోక్యం కలుగజేసుకుంటే విసుక్కునే మనకి ఇది అంత ఖచ్చితమైన గద్దింపో చూడండి. అబ్రహాము మోరియా కొండ ఎక్కుతున్న దృశ్యం గురించి తేలికగా అనుమానాస్పదంగా వచ్చే వ్యాఖ్యలను పక్కకు నెట్టండి. యుగయుగాల వరకు మనుషులంతా పాఠం నేర్చుకోవలసిన మహత్తరమైన దృశ్యం అది. దేవదూతలు అప్రతిభులై చూసారా దృశ్యాన్ని.
ఈ వృద్దుని విశ్వాసమే ప్రపంచమంతటా ఉన్న జనుల విశ్వాసానికి ప్రతీకగా, ప్రాకారంలా నిలిచిపోవాలి. తొట్రుపడని విశ్వాసం ఎప్పుడూ దేవుని విశ్వాస్యతని రుజువు చేస్తుందన్న సత్యం ఈ సంఘటన ద్వారా స్థిరపడాలి. అంటే మనలో విశ్వాసం ఉంటే దేవుడెప్పుడు దాన్ని వమ్ముచేయడు.
కాబట్టి ఈ విషమ పరీక్షకు తట్టుకుని విశ్వాసంతో విజయం సాధించినప్పుడు దేవుని దూత - అంటే యెహోవా లేక దేవుని వాగ్దానాలన్నీ సార్ధకమైన పుణ్యమూర్తి యేసుప్రభువు - అబ్రహము భుజం తట్టి అన్నాడు, "నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. "నువ్వు నన్ను గుడ్డిగా నమ్మావు. నేను దానిని వమ్ము చేయను. నిన్ను కూడా నేను నమ్ముతాను. నువ్వు నా స్నేహితుడివి. నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను.
అన్ని కాలాల్లోనూ ఈ కథ ఇంతే. ఇక ఎప్పటికీ ఈ వైనం మారదు. విశ్వాస సంబంధమైన వాళ్లు అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు.
దేవునికి స్నేహితుడిగా ఉండడం అన్నది మామూలు విషయం కాదు.