Skip to Content

Day 127 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

వారు విసుకక నిత్యము ప్రార్ధన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను (లూకా 18: 1).


విసుగుపుట్టి ప్రార్థన చెయ్యడం మానుకోవడం అనేది క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే అతి భయంకరమైన శోధన. మనం ఒక విషయం గురించి ప్రార్థన చెయ్యడం మొదలుపెడతాము. ఒక రోజు, ఒక వారం, మహా అయితే ఒక నెలరోజులు దేవుడికి విన్నవించుకుంటాము. ఏదీ ఖచ్చితమైన సమాధానం రాకపోతే విసుగెత్తి ఇక బొత్తిగా ప్రార్థించడమే మనుకుంటాము.


ఇది చాలా ప్రమాదకరమైన పొరపాటు. ఇది ఆరంభశూరత్వం. కనిపించిన ప్రతి పని మొదలుపెట్టి ఏది పూర్తి చెయ్యలేని పరిస్థితి. ఇది జీవితం నాశనం కావడానికి హేతువు.


కార్యాన్ని మొదలుపెట్టి పూర్తిచేయకుండా వదిలేసే పద్ధతిని అలవాటు చేసుకున్న వ్యక్తి పరాజయాలను అలవాటు చేసుకుంటున్నాడన్నమాట. ఒక ప్రయోజనం కోసం ప్రార్థించడం మొదలుపెట్టి సరైన జవాబు దొరికేదాకా ప్రార్థించని ప్రతి వ్యక్తి ఇదే అలవాటు పడుతున్నాడు.


ప్రార్థనలు విసుగు చెందడం అంటే ఓడిపోవడం. ఈ ఓటమి ప్రార్థన అంటే అనాసక్తి, విశ్వాసం లేకుండా చేస్తుంది. జయజీవితానికి ఇది ప్రక్కలో బల్లెంలాంటిది.


అయితే కొందరు అడుగుతారు, "ఎంతకాలం ప్రార్ధన చెయ్యాలి? కొంతకాలం చేశాక ఇక దేవుడి చేతిలో ఆ విషయాన్ని వదిలి ఆయనకు మొర్రపెట్టడం మానేయ్యాలి కదా?"


దీనికి ఒకటే సమాధానం - మీరు అడిగిన విషయం మీకు దొరికేదాకా ప్రార్థించాలి. లేక అది దొరుకుతుంది అన్న నిశ్చయత మీ హృదయంలో కలిగేదాకా ప్రార్థించాలి.


మనం దేవుని సన్నిధిలో గోజాడడాన్ని ఈ రెంటిలో ఏదో ఒకటి జరిగేదాకా ఆపకూడదు. ఎందుకంటే ప్రార్థన అంటే కేవలం దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు. అది సైతానుతో పోరాటం కూడా. ఎందుకంటే ఈ పోరాటంలో దేవుడు మన ప్రార్ధనలను సైతానుకి వ్యతిరేకమైన ఆయుధంగా వాడుతున్నాడు. కాబట్టి ఎప్పుడూ ప్రార్థన చేయడం ఆపాలో నిర్ణయించవలసింది దేవుడే. మనకి ఆ హక్కులేదు. జవాబు వచ్చేదాకా లేక జవాబు వస్తుందన్న నిశ్చయత కలిగేదాకా మన ప్రార్ధనలను ఆపే అధికారం మనదికాదు.


మొదటి సందర్భంలో అయితే సమాధానం మన కంటికి కనిపిస్తుంది గనుక ప్రార్థించడం మానేస్తాము. రెండవ సందర్భంలో అయితే సమాధానం వస్తుందని నమ్ముతాము గనుక మానేస్తాను. ఎందుకంటే మన హృదయంలోని నమ్మకం మన కంటికి కనిపించే దృశ్యాల వంటిదే. ఎందుకంటే ఈ నమ్మకం దేవునినుండి, దేవుని వలన కలిగిన నమ్మకం.


మనం ప్రార్థనా జీవితంలో అనుభవజ్ఞులమౌతున్న కొద్దీ దేవుడిచ్చే నిశ్చయత ఎలాంటిది అనే విషయాన్ని మరింతగా గుర్తుపడుతుంటాము. ఆనిశ్చయతను ఆధారం చేసుకుని ఎప్పుడు నిశ్చింతగా ఉండవచ్చు. లేక ఎలాంటి పరిస్థితిలో మన ప్రార్థనని కొనసాగించాలి అనే సంగతి మనకు అర్థమవుతుంది.


దేవుని వాగ్దానాల మజిలీలో వేచి ఉండండి. దేవుడొచ్చి మిమ్మల్ని అక్కడ కలుస్తాడు. తన వాగ్దానాలబాట మీదుగానే నడిచివస్తాడాయన.


Share this post