- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
ఆయన గాయపరచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును (యోబు 5: 18).
భూకంపం మూలంగా గతంలో స్థానాలు తప్పిన కొండల్లోగుండా మనం వెళ్తే మనకి తెలుస్తుంది. అల్లకల్లోలం జరిగిపోయిన వెంటనే మనోజ్ఞమైన నెమ్మది ఆలుముకుంటుందని. అస్తవ్యస్తంగా కూలిపోయిన బండరాళ్ల క్రింద ప్రశాంతమైన సరస్సులు పలుకరిస్తాయి. ఆ బండరాళ్ల నీడల్లో నీటి తుంగ మొదలైన అనేక విధాలైన జల వల్లులు మొలకెత్తుతాయి. నాశనం జరిగిపోయిన తరువాత బాధాకరమైన జ్ఞాపకాల సమాధుల మీద సరికొత్త రూపుదిద్దుకుంటుంది. దాని ఆలయ శిఖరం తెల్లగా తుఫాను వెలిసిన మసక కాంతుల్లో దేవుని వైపుకి రక్షణ కోసం అర్రులు చాస్తున్నట్టు ఆకాశం వైపుకి చూస్తుంటుంది. భూమి పునాదులు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వతాల గాంభీర్యం ఆయనదే.
భూకంపం కల్పించి ఆయన భూమిని దున్నాడు, లోతుగా నెర్రలుచేసి గాయపరిచాడు. నిద్రపోయే మైదానాలు ఉలిక్కిపడ్డాయి. కొండలు బండలు ఎగిరెగిరిపడ్డాయి.
పర్వతాలకి తెలుసు దైవరహస్యం అనాదిగా మదిలో దాచుకున్న సత్యం దేవుని శాంతి ఉంటుంది నిత్యం, ఇదే వాటి విశ్రాంతికి ఆధారం.
అందాన్ని వాటికి కిరీటంగా పెట్టాడు. తన కృపకు అవే జన్మస్థానాలు తన ఉదయాన్నే వాటిపై వెలిగించాడు. చేశాయవి సంధ్యాకాంతిలో స్నానాలు కొండగాలి వాటికి వార్తాహరుడు సుడిగాలులు కేంద్రం నుంచి వచ్చే సమాచారాలు కారుమబ్బు వర్షధారలు ప్రేమగీతాలు లోయల్లో ధ్వనించి వ్యాపించే సంగీతాలు.
సెలయేళ్లను లాలించే తూగుటుయ్యాల మబ్బుతునకలను నిద్రపుట్టే జోల. కల్లాకపటాలెరుగని కొండజాతులకి ఇల్లు వాకిలి కొండచరియలు.
నగరాల్లో వేసారిన నాగరికులు ఆరాధిస్తారు పర్వతాల పవిత్రస్థలాల్లో అటూ ఇటూ సంచరిస్తూ అందరి దేవుడే అలరిస్తాడు తన ఆదరణతో.
పర్వతాల ప్రశాంతతలోని రహస్యం వినండి. వాటి అణువణువులో నిండిన అందాన్ని కనండి. శ్రమలు విరుచుకుపడ్డప్పుడు కష్టాలు ముంచుకొచ్చినప్పుడు
దేవుడు తన పర్వతాలను తన నాగలితో దున్నుతున్నాడని కృపా సమృద్ధి బీజాలను విత్తనున్నాడని నిత్యమైన ఆయన శాంతిని తలచి తత్తరపాటును మానండి