Skip to Content

Day 121 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలంముందే వాగ్దానము చేసెను (తీతు 1: 2-4).


విశ్వాసం అంటే ఒక విషయం తప్పకుండా జరుగుతుంది అనే ఒక రకమైన సంకల్పశక్తిని మన మనసులో పెంచుకోవడం కాదు. దేవుడు ఈ మాట చెప్పాడు కాబట్టి జరుగుతుందనే సత్యాన్ని గుర్తించడమే. ఆ మాట నిజమని, ఉల్లసిస్తూ దేవుడు పలికాడు కాబట్టి ఇక చీకు చింత మాని ఉండడమే విశ్వాసం అంటే.


విశ్వాసం అనేది మనకి దొరికిన ఒక వాగ్దానాన్ని భవిష్యవాణిగా మలుచుకుంటుంది. అది ప్రస్తుతానికి వాగ్దానమే కాబట్టి మనం సహకరించకపోతే దానికంటూ ఒక అర్థం ఉండదు. అయితే దాన్ని విశ్వాసానికి జోడిస్తే అదే ముందు జరగబోయే విషయాన్ని ఇప్పుడే తెలుసుకోవడం అవుతుంది. మనలో ఓ నమ్మకం కలుగుతుంది. ఇది తప్పకుండా జరిగితీరుతుంది, ఎందుకంటే దేవుడు అబద్ధమాడడు కాబట్టి.


చాలామంది ఎక్కువ విశ్వాసం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ప్రార్థనలన్నీ సూక్ష్మంగా గమనించి వాటి నిజమైన అర్ధాన్ని పరిశీలిస్తే, అవి నిజానికి విశ్వాసం కోసం ప్రార్థనలు కావని అర్థమవుతుంది. వాళ్లు కేవలం తాము విశ్వసించిన దానిని ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తుంటారు.


నిజమైన విశ్వాసి "ఇది నాకు మంచిని చేకూర్చేది గనుక దేవుడు నాకిచ్చాడు" అనడు. ఏమంటాడంటే "దేవుడు దీన్ని నాకు ఇచ్చాడు కనుక ఇది నాకు మంచిదన్నమాట."


విశ్వాసం అంటే చీకట్లో దేవునితో నడుస్తూ తన చేతిని వదలకుండా పట్టుకోమని దేవుణ్ణి ప్రార్థించడమే.


నీ విశ్వాసంపై విశ్వాసాన్ని కాదు తనపై విశ్వాసాన్నే అడిగాడు విశ్వకాపరి మన యేసు నా చెంతకి రండని పిలిచాడు తనపై విశ్వాసాన్ని అడిగాడు వెలుగు నీడల్లో విశ్వసించండి విశ్వాస ఫలాలను ఆయన నుండే ఆశించండి


Share this post