- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను... అప్పుడు నిండైన పుష్టిగల ఆ యేడు వెన్నులను
ఆ పీలవెన్నులు మ్రింగివేసెను (ఆది 41:4,7).
ఆ కలను ఉన్నదున్నట్టుగా చూస్తే మనకొక హెచ్చరిక కనిపిస్తుంది. మన జీవితంలో అతి శ్రేష్టమైన సంవత్సరాలు, మంచి అనుభవాలు, సాధించిన ఘన విజయాలు, చేసిన అత్యుత్కృష్టమైన సేవ మొదలైన మంచి విషయాలను పరాజయాలు, వైఫల్యాలు, అప్రతిష్ట దేవుని రాజ్యం పట్ల పనికిమాలినతనం మొదలైనవి మింగేసే అవకాశం ఉంది. వాళ్ళ జీవితాల్లో ఘనవిజయం సాధిస్తారని అందరూ ఎదురుచూస్తే వాళ్ళు ఊహించలేనంత అట్టడుగుకి దిగజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆలోచిస్తే బాధేస్తుంది, కాని ఇది నిజం.
ఒక భక్తుడు చెప్పాడు, ఇలాటి విచారకరమైన విషయం నుండి తప్పించుకోవాలంటే ఒకటే సాధనం. ప్రతిదినం, ప్రతి ఘడియ దేవునితో ఓ వినూత్నమైన తాజా సంబంధాన్ని తిరిగి కల్పించుకోవడం. నిన్నటి నా ఘనకార్యాలూ, నా గతంలోని దీవెనకరం, ఫలభరితం, జయకరం అయిన అనుభవాలు ఈ రోజున నాకేమీ లాభం కలిగించవు సరికదా ఈనాటి పరాజయాలు వాటిని మింగెయ్యవచ్చును కూడా. కానీ నిన్నటి గొప్పతనం అంతా ఈ రోజు నేను అంతకన్న గొప్ప పనుల్ని చెయ్యడానికి ప్రేరేపణగా ఉండాలి.
క్రీస్తుకి అంటుకట్టబడడం ద్వారానే నెలకొనే ఈ వినూత్నమైన తాజా సంబంధం మాత్రమే నా జీవితంలో నుండి చిక్కిపోయిన ఆవుల్ని, పీల వెన్నుల్ని దూరంగా ఉంచగలదు.