Skip to Content

Day 119 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే (యాకోబు 5:17).


అందుకు దేవునికి వందనాలు! రేగు చెట్టు క్రింద చతికిలబడ్డాడు, మనలాగానే. మనం తరచుగా చేసినట్టే దేవునిమీద సణుగుకున్నాడు. ఫిర్యాదు చేసాడు. మనకులాగానే అతనిలోనూ అపనమ్మకం చోటు చేసుకుంది. అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తరువాత మాత్రం కథ మలుపు తిరిగింది. "మనవంటి స్వభావముగల" మనుష్యుడైనప్పటికీ "ఆసక్తితో ప్రార్థన చేసాడు." ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరోటిలేదు. ఏలీయా కేవలం ఆసక్తితోనే ప్రార్ధన చెయ్యలేదు. ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించాడు. ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి? మనం వదలకుండా ప్రార్థించాలి.


కర్మేలు పర్వత శిఖరం మీదికి ఎక్కిరండి. విశ్వాసానికీ, ప్రత్యక్షంగా కనిపించే దానికీ సామ్యం కుదిర్చే వైనాన్ని వినండి, ఆకాశంనుండి అగ్ని దిగిరావడం కాదు ఇప్పుడు కావలసింది. ఇప్పుడు ఆకాశంనుండి జలధారలు కురియాలి. అగ్నిని అవరోహణం కమ్మని ఆజ్ఞాపించిన మనిషి, ఇప్పుడూ అదే పద్దతిలో అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి. ఏలీయా నేలమీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను అని రాయబడి ఉంది. అంటే అన్ని ధ్వనులనూ, ఏకాగ్రతకి భంగం కలిగించే శబ్దాలనూ దూరంగా ఉంచాడన్నమాట. ఇలాటి భంగిమలో దుప్పటి ముసుగేసుకుని బయట ఏం జరుగుతున్నదో కనిపించకుండా ప్రార్థించాడన్నమాట.


సేవకుణ్ణి పిలిచి నువ్వు పైకి ఎక్కి సముద్రంవైపుకి చూడమన్నాడు. అతడు వెళ్ళి చూసి తిరిగి వచ్చాడు "ఏం లేదు"అన్నాడు.

ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తాము. "నేను ముందే అనుకున్నాలే" అంటామేమో. ప్రార్థించడం చాలిస్తామేమో, ఏలీయా అలా చేసాడా? లేదు. "మళ్ళీ వెళ్ళు"అన్నాడు. సేవకుడు తిరిగి వచ్చి "ఏం లేదు" "మళ్ళీ వెళ్ళు" "ఏం లేదు."


కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు "మనిషి చెయ్యంత మేఘం కన్పించింది" అన్నాడు. ఏలీయా చెయ్యి అర్థింపుగా పరలోకం వైపుకు చాపబడింది. జవాబుగా వర్షం క్రిందికి దిగింది. ఎంత త్వరగా కురిసిందంటే తన పంచకళ్యాణి గుర్రాల సహాయంతో ఆహాబు సమరయ ద్వారాన్ని చేరలేకపోయాడు. ఇదే విశ్వాసానికీ, ప్రత్యక్షానికీ సామ్యం చెప్పే ఉపమానం.


ఇలా ప్రార్ధించడం నీకు తెలుసా. పనుల్ని సాధించే ప్రార్థన నీకు తెలుసా. కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగానైనా ఉండొచ్చు. కాని వాటిని లెక్కచెయ్యవద్దు. మన పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆలస్యం చెయ్యడం కూడా ఆయన మంచితనంలో ఒక భాగమే, మనకి లాభమే.


ముగ్గురు పిల్లలు విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు. మొదటి బాలుడన్నాడు "విశ్వాసం అంటే క్రీస్తును పట్టుకోవడం." రెండో పిల్లవాడు పట్టుకునే ఉండడం" అన్నాడు. మూడో పిల్లవాడు "ఎప్పటికీ వదలక పోవడం" అన్నాడు. తుమ్మ జిగురులా అంటి పెట్టుకుని వదలని విశ్వాసం ఇది.


Share this post