Skip to Content

Day 117 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నేను ... జీవించువాడను; మృతుడనైతిని గానీ ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను (ప్రకటన 1:18).


పువ్వుల్లారా, ఈస్టరు రోజున పూసిన లిల్లీమొగ్గల్లారా, ఏదీ ఈ ఉదయం నాకా దివ్వమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి! ఎన్నో కృంగియున్న హృదయాలకి మీరు అందించిన ఆ శాశ్వత జీవపు కథను నాకూ వినిపించండి.


జ్ఞానం నిండిన ఓ పరిశుద్ధ గ్రంథమా, ఏదీ మరోసారి నీ పుటలు తిరగెయ్య నియ్యి. చనిపోవడం లాభం అంటూ నీవందించే నిశ్చయతను మళ్ళీ రుచిచూడనియ్యి.

కవులారా, నిత్యజీవపు సూక్తులు ప్రతిధ్వనించే మీ పదాలను మళ్ళీ వినిపించండి. గాయకులారా, ఉత్సాహ గీతాలు అందుకోండి. ఆ పునరుత్థానపు కీర్తనను మళ్ళీ వినిపించండి.


చెట్లూ, చేమలూ, పక్షులూ, పురుగులూ, ఆకాశం, సముద్రం, గాలులూ, పొనలూ మీరంతా ఆ సందేశాన్ని క్రొత్తగా వినిపించండి. కిలకిలలాడండి, ప్రతిధ్వనింపజెయ్యండి. ప్రతి అణువులోనూ ఈ మాట స్పందింపజేయండి. గాలంతా ఈ నినాదం నింపండి.


మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఆశ నిశ్చయతగా మారేదాకా, నిశ్చయత అంతా ప్రత్యక్షతలో కేంద్రీకృతమయ్యేదాకా గానం చెయ్యండి. పౌలులాగా మనమంతా చావుకెదురై నప్పుడు జయగీతాలతో విశ్వాసపు స్థిరత్వంతో, పవిత్రతతో పొంగిపొరలే వదనంతో అతిశయించేంత వరకూ పాడండి.


సమాధి దారిలో మృతుణ్ణి మోసుకుంటూ

మ్లానవదనాలతో మౌనంగా సాగే మానవుల్లారా

సమాధులవంక ఈ రోజుకి చూడకండి

కళ్ళెత్తి దేవుని మహిమని కలకాలం కనుగొనండి


కన్నీళ్ళ కాలం కదిలిపోయింది

పునరుత్థాన పుష్పాలు పకపకమన్నాయి

హృదయాలు పులకరించాయి

గుడిగంటల పిలుపుకి బదులు పలికాయి


క్రీస్తు ఇప్పటికీ మృతుడై ఉంటే

సాతాను చెరలో మగ్గుతూ ఉంటే

పాతాళకూపంనుంచి విముక్తుడు కాకుంటే

నీ కన్నీరు తుడిచేవాడు లేకుంటే


నిరాశకి తావుంది, దుఃఖానికి చోటుంది.

కానీ లేచాడాయన కట్లు తెంచుకుని

మానండిక నిట్టూర్పులు ఇది గ్రహించుకుని

కనీసం ఈ రోజుకి మానండి చిరాకు.


ఒక పాస్టరుగారు తన గదిలో కూర్చుని తాను ఈస్టరు రోజున ఇవ్వవలసిన ప్రసంగాన్ని రాసుకుంటున్నాడు. హఠాత్తుగా ఒక ఆలోచన ఆయన మనస్సుని మెరుపులా తాకింది. "ప్రభువు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు!" ఒక్క గంతులో ఆయన కుర్చీలోంచి లేచి కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ పచార్లు చెయ్యసాగాడు. "క్రీస్తు బ్రతికే ఉన్నాడిప్పుడు. ఒకప్పుడున్నవాడు కాడు ఆయన. ఇప్పుడున్నవాడు. ఆయన కేవలం ఓ చారిత్రాత్మక సత్యం కాదు. ప్రస్తుతం సత్యం. జీవించి ఉన్న సత్యం. ఈ ఈస్టరు నిజం ఎంత గొప్పది."


మరణం నుండి తిరిగి లేచిన క్రీస్తును మనం నమ్ముతాము. గతంలోకి మీ ముఖం తిప్పుకోకండి. ఆయన సమాధిని ఆరాధించకండి. బ్రతికి ఉన్న క్రీస్తుని ఆరాధించండి. ఆయన సజీవుడు కాబట్టి మనం సజీవులం. ఎప్పటికీ సజీవులం.


Share this post