Skip to Content

Day 116 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను (ఫిలిప్పీ 3:8).


వస్తువులు ధగధగా మెరవాలంటే కొంత ఖర్చవుతుంది. కాంతి జనకాలు ఉంటే తప్ప కాంతి పుట్టదు. వెలిగించని కొవ్వొత్తి వెలుగునియ్యదు. మంట లేనిదే తళతళలు లేవు. అలాగే మనం అగ్నికి ఆహుతైపోకుండా ఇతరుల్ని వెలిగించలేము. మండటం శ్రమ పడడానికి గుర్తు. మరి మనమైతే నొప్పినుండి దూరంగా తొలిగిపోయే ప్రయత్నం చేస్తుంటాము.


మనం దృఢంగా ఉండి పనులు చెయ్యడానికి శక్తి కలిగి ఉండి, మన మనస్సు లోను, చేతులనిండా ఇతరులకి ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టి ఉన్నప్పుడు మనం ఎంతో మానవసేవ చేస్తున్నాము అనుకుంటాము.


అయితే మనం ఒక మూలన చేరి శ్రమల ననుభవించడం తప్ప మరేమీ చేయ్య లేని స్థితిలోనో, లేక రోగ పీడితులంగానో ఉన్నప్పుడూ, బాధ మనల్ని కబళిస్తు న్నప్పుడు, మన కార్యక్రమాలను పట్టించుకునే నాధుడు లేక మూలన బడినప్పుడూ మనం ఇతరులకేమీ ఉపయోగపడడం లేదు అనుకుంటాము. మన జీవితమే పనికిరానిదై పోయినట్టు బాధపడతాము.


అయితే దీర్ఘశాంతం కలిగి, దేవుని చిత్తానికి లోబడితే మనం హుషారుగా ఇతరులకి సహాయపడే రోజులకంటే, బాధల్లో కృశిస్తూ ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండగలం. ఎందుకంటే బాధల్లో ఉన్నవాళ్ళు మండే కొవ్వొత్తి లాటివాళ్ళు. వాళ్ళు కాంతుల్ని వెదజల్లుతాము.


రేపటి మహిమ తేజస్సు ఈనాటి దారిద్ర్యంలో వేళ్ళు పాతుకుంటుంది. చాలా మంది సిలువ లేకుండా మహిమ కావాలంటారు. మండకుండా వెలుగు నివ్వాలంటారు. కాని శ్రమలు పొందిన తరువాతే కదా కిరీటం దొరికేది?


మా ఊళ్ళో పెరిగే మందుచెట్టు కథ విన్నారా

నూరేళ్ళు పెరిగి పెరిగి పరిపక్వమవుతుంది

చిటారుకొమ్మన చిన్నారిమొగ్గ కళ్ళు తెరిచి

వైభవంగా విరబూస్తాయి వేవేల పుష్పాలు

మందుచెట్టు త్యాగం కన్నారా

పూలగుత్తి అందమే మందు చెట్టు అంతం


మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా

విరబూసిన వేవేల పుష్పాలు

రాలుతూ అవుతాయి నేలకి తలంబ్రాలు

రాలిన ప్రతి పువ్వు వేళ్ళు పట్టి

ప్రతి పువ్వూ అవుతుందో మందు చెట్టు


పూల అంతం అదే మందు చెట్ల కారంభం

అన్నిటికంటే అతి శ్రేష్టమైన కథ విన్నారా

ఒక మహాత్ముడి, పవిత్రుడి పరమగాధ

ఆయన మరణం అనేకాత్మల జీవం

ఆకాశంలో జ్యోతుల తళతళలు

మనలో ఆయన ఆత్మజ్యోతి మిలమిలలు


బ్రతుకుని ప్రేమించకండి, ఆయన చెప్పాడు వినండి

ప్రేమ నిండిన బ్రతుకు కోరండి

మన బ్రతుక్కి ప్రాణం ఆయన త్యాగం

ఆయన భరించిన నష్టం మనకంత లాభం

ఆయన కన్నీళ్ళు మన చిరునవ్వుల కాంతుల

ఆయన ఆవేదన మన బ్రతుకుల్లో శాంతులు


Share this post