Skip to Content

Day 115 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి (మత్తయి 27:61).


విచారం అన్నది ఎంత అర్థంలేని విషయం! అది నేర్చుకోదు, తెలుసుకోదు. కనీసం ప్రయత్నించదు. ఈ మరియలిద్దరూ కుమిలిపోతూ ప్రభువు సమాధి ద్వారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు, ఇప్పటిదాకా పునరుత్థానోత్సవాలతో జయార్భాటంతో గడిచిన ఈ 2 వేల సంవత్సరాల గురించి వాళ్ళకేమైనా తెలుసా? మా ప్రభువు వెళ్ళి పోయాడు అన్న ధ్యాసేగాని దాని వెనక ఉన్న పరమార్థాన్ని ఏమన్నా గ్రహించారా?


వాళ్ళకి దుఃఖకారణమైన క్రీస్తు మరణం ద్వారానే మనందరి విమోచన కారణమైన జయశీలి క్రీస్తు లేచాడు. లెక్కలేనన్ని హృదయాల అంగలార్పులో నుండి పునరుత్థానం చిగురించింది. అయితే శోకోపహతులైన ఆ స్త్రీలు మరణబీజాన్నే చూస్తున్నారు గాని, శాఖోపశాఖలుగా విస్తరించనున్న పునరుత్థానపు మొలకను గమనించడంలేదు. తాము ఏ సంఘటనను తమ ప్రభువు అంతిమ శ్వాసగా భావించారో ఆ సంఘటనే లోకాధిపతిగా ఆయన అభిషేకానికి నాంది అని గ్రహించడం లేదు. యేసు స్వరం తాత్కాలికంగా మూగబోయింది తిరిగి పదిరెట్లు శక్తిగల పునరుజ్జీవనానికే.


కాని ఆ స్త్రీలకిది ప్రస్తుతం అగమ్యగోచరం. విలపించారు, ఏడ్చారు, నీరసించి తిరిగి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళ హృదయాలు కుదుటబడక తిరిగి సమాధి దగ్గరికి వచ్చారు. అయితే సమాధి సమాధే. సమాధికి స్వరం లేదు, తేజస్సు లేదు.


మన జీవితాల్లోనూ ఇది అంతే, మనమంతా వనంలో సమాధి నానుకుని దిగాలు పడి కూర్చుంటూ ఉంటాము. ఈ దుఃఖానికి ఉపశమనం లేదు. ఈ దుఃఖంలో ఏ ప్రయోజనమూ లేదు. దీనిద్వారా నాకు చేకూరే లాభమేమీ లేదు అనుకుంటూ ఉంటాము. కాని మన లోతైన దుఃఖం వెనుక, అతి భయంకరమైన ఆపద వెనక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు, తన సమాధీలో విజేతగా తిరిగి లేవడానికి.


చావు పొంచియుంది అని మనం అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు. ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురు చూస్తుంటుంది. పేరుకు పోయిన కారుచీకటిలో తిరిగి మరెన్నటికీ అస్తమించని ఒరుకాంతి కిరణం తళుక్కు మంటుంది. ఈ అనుభవాలన్నీ మన గుండెలో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడుచెయ్యదు. అక్కడక్కడ విచారపు నీడలున్నప్పుడే మన సంతోషం ప్రస్ఫుటమవుతుంది. దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీపస్థంభాలవల్ల మన విచారపు క్రీనీడలు కూడా అందంగానే కనిపిస్తాయి. ఆ నీడల్లో పూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు. వాటిని కోసి మాల కట్టడానికి మనకు ఇష్టం లేకపోవచ్చు. కాని అవి ఆత్మపుష్పాలు ప్రేమ, ఆశ, విశ్వాసం, శాంతి సంతోషాలు. ప్రతి క్రైస్తవుడి అంతరంగంలోను ఉన్న విచారపు సమాధి చుట్టూ వికసించే పరిమళసుమాలు ఇవి.


శోకాల కాలిబాట

క్రీస్తు విశ్రమించిన చోట

గులాబీలు పూయవు ఈ తోట

ఇది ముళ్ళబాట


పరలోక దీవెనల గరికపూలు

వికసించాలంటే ఈ చోటే మేలు

ఈ బాటలో సిలువ మోసినవాడు

రాకుమారుడవుతాడు ముందునాడు


Share this post