Skip to Content

Day 112 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నేను నడచుమార్గము ఆయనకు తెలియును (యోబు 23:10).


విశ్వాసీ, ఎంత ఆదరణకరమైన హామీ ఇది! నువ్ నడిచేదారి అది ఎంత అస్తవ్యస్తంగా, వంకరటింకరగ, అర్థం కాకుండా ఉన్నప్పటికీ అది శ్రమలతో కన్నీళ్ళతో నిండిన దారైనప్పటికీ, అది దేవునికి తెలుసు. అగ్నిగుండం వేడిమి ఏడింతలు ఎక్కువ కావచ్చు. దేవుడు దాన్ని చల్లబరుస్తాడు. మన అడుగుల్ని సరిగా వేయించే సర్వశక్తిమంతుడు మనకున్నాడు. అది మారాలాంటి చేదైన ప్రదేశం కానివ్వండి, ఏలీములాటి సేదదీర్చే చోటు కానివ్వండి.


ఆ దారిలో ఐగుప్తు సైన్యాలకి చీకటినీ ఇశ్రాయేలువాళ్ళకి వెలుగునూ ఇచ్చే అగ్ని స్థంభం, దీప స్థంభం ఉన్నాయి. అగ్ని గుండం మండుతోంది. కాని దాన్ని వెలిగించిన దేవుడు నమ్మదగినవాడు. అంతేకాక ఆ అగ్ని మనల్ని దహించడానికి కాదుగాని, శుద్ధి చెయ్యడానికే అని ఆయన మాట ఇచ్చాడు. ఆయన నిర్ణయించిన సమయానికి ఆ శుద్ది కార్యక్రమం పూర్తి అయితే ఆయన తన ప్రజల్ని మేలిమి బంగారంలాగా బయటికి తీస్తాడు.


ఆయన చాలా దూరంగా ఉన్నాడనుకునే సమయంలో నిజానికి ఆయన అతి సమీపంగా ఉంటాడు.


మిట్ట మధ్యాహ్నపు సూర్యబింబం కంటే ప్రకాశమానమైనదెవరో మీకు తెలుసా? ఉదయకాలపు కిరణాలతోపాటు మనల్ని పలకరించి నిద్రలేపేదెవరో తెలుసా? మితిలేని లాలిత్యం, మృదుత్వం, వాత్సల్యం కురిపిస్తూ మన వెన్నంటి తిరుగుతూ ఉండే ఆ కళ్ళెవరివో మీకు తెలుసా?


కష్టాలెదురైనప్పుడు లోకానికి చెందిన మనుషులు ఏదేదో పదజాలాలను సృష్టించి ఇదంతా ఖర్మ అంటారు. "అంతా ఆ పైవాడి లీల" అంటారు. విధి వైపరీత్యం అంటారు. విధి అంటే ఏమిటి?


సజీవుడైన పరమ దేవుడిని, చక్రవర్తిలాగా అన్నింటినీ తన సంకల్పమాత్రంగా నడిపిస్తున్న దేవుడిని, వర్ణించడంలో అర్థంపర్థంలేని విధిలాటి మాటల్ని ఆయనకి బదులుగా ఉపయోగించడం ఏమిటి? పనులు చేస్తూ తన ఇష్ట ప్రకారం సమస్తాన్నీ చక్కబరుస్తున్న వ్యక్తిగతమైన నిజ యెహోవాకి బదులుగా ఏవేవో వేదాంత శబ్దాలు వాడడం ఎందుకు?


మహాశ్రమలు తనను చుట్టుకుని ఇహలోకపరంగా ఆశలన్నీ అడుగంటినవేళ యోబు దృష్టి నేరుగా దేవుని పైనే పడింది. మనుషులెవరూ కాదు, దేవుడే అది తనకు చేసాడని నమ్మాడు. ఇలాటి దృష్టి మనమూ కలిగి ఉంటే మనకి వచ్చిన శ్రమ ఎంత వేధిస్తున్నా అది మనల్ని బాధించలేదు కదా. యోబుకి షెభాయియుల కత్తుల వెనక దేవుని హస్తమే కనబడింది. ఆకాశంనుండి పడిన పిడుగు వెనక, తన కుమారుల ఇంటిని చుట్టుముట్టి నాశనం చేసిన సుడిగాలి వెనక, సమస్తమూ పోయి నిశ్శబ్దం తప్ప ఏమీ మిగలని తన జీవితం వెనక దేవుని హస్తాన్నే చూసాడు.


"యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక."


అన్నిటిలోనూ దేవుణ్ణి చూస్తూ ఉన్న యోబులో విశ్వాసం పరిపక్వమైంది. ఊజు దేశపు సంపన్నుడు తన బూడిదేలో కూర్చుని ఉండికూడా అనగలుగుతున్నాడు "ఆయన నన్ను సంహరించినా, నేనాయనలో నమ్మకముంచుతాను."


Share this post