- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్ళేను (హెబ్రీ 11:8).
తానెక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదు. తాను దేవునివెంట వెళ్తున్నాడన్నది మాత్రం తెలుసు. అది చాలు అతనికి. ప్రయాణంమీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదుగాని ప్రయాణం చేసినవాడి మీద పూర్తిగా ఆధారపడ్డాడు. తనకెదురవ్వబోయే కష్టాల గురించి చూడలేదు. కానీ మార్గాన్ని సిద్ధపరచి నిశ్చయంగా తన మాటను నిలబెట్టుకోవడానికి సమర్థుడు నిత్యుడు, అదృశ్యుడు, జ్ఞానవంతుడు అయిన పరలోకపు రాజు పైనే దృష్టి నిలిపాడు. ఇది ఎంత మహిమాన్వితమైన విశ్వాసం! ఇది నీకియ్యబడిన పని, ఇవి నువ్వు చెయ్యగలిగిన వీధులు. నీ ఆజ్ఞలు ఎలాటివో అని నువ్ పరీక్షించుకోనక్కరలేదు. వాటిని అనుసరించి ఓడను సముద్రమార్గం పట్టించడమే నీ పని. అన్నిటినీ వదిలి లేచి క్రీస్తుని వెంబడించు. ఎందుకంటే భూమిపైనున్న అతి శ్రేష్టమైనవి పరలోకంలోని అత్యల్ప విషయాలకు సాటిరావు.
విశ్వాసపు పందెంలో దేవునితో కలిసి ఉత్సాహంగా బయలుదేరడం మాత్రమే కాదు నువ్వు స్వంతగా వేసుకున్న ప్రయాణపు పథకాలన్నిటినీ ముక్కలు ముక్కలుగా చించి పారెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఊహించినట్టుగా ఏదీ జరగదు.
నిన్ను నడిపించేవాడు అందరూ నడిచిన దారిగుండా నిన్ను నడిపించడు. నీ కళ్ళు ఆ దారుల్ని చూస్తాయని నీ కలల్లో కూడా నీవు ఊహించి ఉండవు. అలాటి దారులగుండా నువ్వు వెళ్తావు. భయం ఆయన దరిచేరదు. అలానే ఆయన నీతో ఉన్నంతకాలం నువ్వు కూడా దేనికీ భయపడకూదని ఆయన అంటున్నాడు.
మసక చీకటిలో తడుములాడుతూ
దారీ తెన్నూ లేక ఒంటరిగా
వెలుగు దేశాన్ని వెదుకుతూ
చీకటి కోనల్లో తిరుగుతున్నాను
దేవుడు నా చేయి పట్టుకున్నాడు
దారితప్పకుండా నడిపించాడు
నాకు తెలియని క్షేమ మార్గాల్లో
నిశ్చల జలాల వెంట పచ్చిక మైదానాల్లో
ఆయన్ను అనుసరించాను
చీకటి చిన్నాభిన్నమై పోయింది
అలసిన నయనాలు ఉదయాన్ని చూపాయి
ముందుముందుకి అరుణోదయంలోకి
ఆయన చేతిలో చేయి వేసి
రాత్రికి దూరంగా సాగిపోయాను