Skip to Content

Day 104 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట

సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము (1థెస్స 4:16,17).


యేసు ప్రభువు సమాధినుండి లేచినది ఉదయం "పెందలకడనే, ఇంకను చీకటియుండగానే" తెరిచియున్న ఆయన సమాధిమీద సూర్యునికంటే ముందు వేకువచుక్క ప్రకాశించింది. నీడలు కరిగిపోలేదింకా, యెరూషలేము నగరవాసులింకా నిద్రలేవలేదు. అదింకా రాత్రే. నిద్రపోయే చీకటి సమయమే. ఆయన లేవడం యెరూషలేము వాళ్ళ నిద్రని చెడగొట్టలేదు. క్రీస్తు శరీరం, అంటే క్రీస్తు సంఘం లేచి ఆరోహణం అయ్యేది కూడా ఇలా పెందలకడ ఇంకా చీకటి ఉండగానే, వేగుచుక్క వెలుగుతూ ఉన్నప్పుడే. ఆయన మృత్యువునుండి మేల్కొన్నట్టే ఆయన పరిశుద్ధులు కూడా లోకమంతా నిద్రలోను, మరణ నిద్రలోను ఉన్నప్పుడే మేలుకుంటారు. మేలుకోవడంలో ఎవరికీ ఇబ్బంది కలిగించరు. ఎవరికీ నిద్రాభంగం కలిగించరు. వాళ్ళని పిలిచే స్వరం ఇతరులకి వినిపించదు. తల్లి ఒడిలో నిద్రపోయే పసిపాపలాగా యేసుప్రభువు వాళ్ళని నిశ్శబ్దమైన సమాధులలో మెల్లగా నిద్రపుచ్చినట్టే అంత మృదువుగానూ, మెల్లగానూ ఆ ఘడియ వచ్చినప్పుడూ వాళ్ళని నిద్రలేపుతాడు. "మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్సహించుడి" (యెషయా 26:19) అనే మాటలు వాళ్ళకి వినిపించి ప్రాణం పోస్తాయి. వాళ్ళ సమాధుల్లోకి మహిమ కిరణాలు చొచ్చుకుపోతాయి. ప్రాతఃకాలపు తొలి కిరణాలు వాళ్ళని పలకరిస్తాయి. తూర్పుదిక్కు సన్నని వెలుతురు ముసుగు సవరించుకుంటూ ఉంటుంది. దాని సున్నితమైన పరిమళం, జోలపాడే స్తబ్దత, దాని నైర్మల్యం, మధురమైన ఏకాంతం, ఆ పవిత్రత, ఆశాదీపాలన్నీ వాళ్ళవే.


ఈ విషయాలకీ, వాళ్ళు గడిపిన చీకటి రాత్రికి ఎంత తేడా ఉందో చూడండి. వీటికీ, వాళ్ళింతవరకూ నిద్రించిన సమాధికీ ఉన్న తేడా గమనించండి. తమని బంధించి ఉంచిన నేలని విదిలించుకుని మృత్యుపాశాలను తెంచుకుని, తమ మహిమ శరీరాలతో, ఆకాశంలో తమ ప్రభువును కలుసుకోవడానికి తేలికగా ఆరోహణమౌతూ ఎవరూ నడవనీ ఆ దారులవెంట, ఆనాడు యూదుల రాజు దగ్గరికి నడిపించిన బేత్హేము నక్షత్రంలాటి వేగుచుక్క కిరణాల జలతారు దారాలమీదుగా ఎక్కిపోతారు. రాత్రంతా విలాపం ఉండవచ్చు. కాని ఉదయంతోనే ఉల్లాసం వస్తుంది.


సైన్యాలు పరలోకం నుండి దిగివస్తూ

హోసన్నా అని పాడుతుంటే

పరిశుద్దులు, దూతలు కైవారం పలుకుతుంటే

శృంగార మహిమాతిశయాలతో యేసు

తనవారిని చేర్చుకుంటాడు

ఇలాగే అవుతుంది. యేసుప్రభు త్వరగా వచ్చెయ్యి


ఒక సైనికుడన్నాడట "నేను చనిపోతే నా సమాధి దగ్గర విలాప సంగీతాలు వాయించవద్దు. తెల్లవారుజామునే మేలుకొమ్మని హెచ్చరించే బూరలు ఊదండి."


Share this post