Skip to Content

Day 103 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి - నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను (యెహెజ్కేలు 3:22).

ప్రత్యేకంగా కొంతకాలం ఎదురుచూస్తూ గడపవలసిన అవసరం రానివాళ్ళెవరూ దేవుని కోసం గొప్ప పనులు చేసినట్టు మనం చూడం. మొదట్లో తప్పనిసరిగా అలాటి వాళ్ళు అనుకున్నవన్నీ పూర్తిగా తారుమారైపోతాయి. పౌలు తాను మారుమనస్సు పొందిన వెంటనే సువార్తతో ఉరకలేసేటపుడు మూడేళ్ళు అరేబియా ఎడారిలో ఉండాల్సిరావడం నుండి ఈనాటి వరకు ఇది ఇలానే వస్తూ ఉంది.


నా విషయంలో ఇలానే జరిగింది. సాహిత్యం ద్వారా దైవసేవ చెయ్యడానికి నాకు అవకాశం దొరకగానే ఎగిరి గంతేసి మొదలు పెట్టేద్దామనుకున్నాను కాని డాక్టరు అడ్డుపడ్డాడు. "లాభం లేదు ఆవిడకి రాయడం ముఖ్యమో, ప్రాణం నిలబెట్టుకోవడం ముఖ్యమో తేల్చుకోవాలి" అన్నాడు. రెండూ చేయ్యాలంటే కుదరదు.


ఇది 1860లో జరిగింది. ఆ గూట్లోనుండి నేను 1869లో బయటికి వచ్చాను. నీడలో తొమ్మిదేళ్ళు నన్ను ఎదురుచూస్తూ ఉంచిన దేవుని జ్ఞానం నాకు అర్థమైంది. దేవుని ప్రేమ మార్పులేనిది. ఆయన ప్రేమ మనకి కనిపించకపోయినా, అనుభవంలోకి రాకపోయినా ఆయన మాత్రం అలానే ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమ, ఆయన ప్రభుత్వం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి. అందువల్ల మనకి ఇష్టంగానూ అభివృద్ధికరంగానూ కనిపించేవాటిని కొన్నిసార్లు మనకివ్వడు. ఎందుకంటే మనలో తన కార్యాలను ఇంకా విజయవంతంగా చెయ్యగలిగే పరిపక్వత ఇంకా రాలేదని ఆయనకి తెలుసు.


నా పనిని మౌనంగా ప్రక్కన పెట్టాను

విశ్రాంతి సమయాన్ని వినయంతో స్వీకరించాను

"విశ్రాంతి తీసుకో" అంటూ యజమాని పిలిచాడు.

"క్రీస్తుతోనే విశ్రాంతి!" నా మనసు పలికింది


తనదైన విశ్రాంతిని తన చేతితో ఇచ్చాడు

ఇప్పుడున్న అనారోగ్యం ఆయన నిర్ణయమే

విశ్రాంతి తీసుకోమంటే కష్టపడబోతాం మనం

ఆయన దారి మంచిది, అంధులం మనం


ఆయనిచ్చిన పనిని ఆయనే పూర్తి చేస్తాడు

అలసిన పాదాలు నడవవలసిన దారులున్నాయి

అలసిన చేతులు చెయ్యవలసిన పనులున్నాయి

ఇప్పుడైతే విధేయత చూపాల్సిన అవసరం ఉంది.


కదలక మెదలక ఉండడంలో దివ్య విశ్రాంతి ఉంది,

తన ఇష్ట ప్రకారం ఆయన చేతులు తీర్చిదిద్దుతాయి

ఆయన పని జరగాలి, పాఠం పూర్తిగా నేర్చుకోవాలి,

మర్చిపోవద్దు, ఆయనకున్న నేర్పు మరెవరికీ లేదు.

పనిచెయ్యడమే కాదు శిక్షణ పొందాలి.

శిక్షలో యేసు శిరసు వంచడం నేర్చుకున్నాడు

ఆయన భారం తేలిక ఆయన కాడి సులువు

నీతి ఉందాయన క్రమశిక్షణలో.


ఏ పనిముట్లు కావాలో ఏరుకోవడం

మన పనికాదు, మనం సేవకులమే

పనీలోను, ఎదురు చూడడంతోను

మనదికాదు, దేవుని చిత్తమే నెరవేరాలి.


దేవుడు మనకి పనులు పురమాయించినట్టుగానే విశ్రాంతి తీసుకునే స్థలాలను కూడా చూపిస్తాడు. విశ్రాంతి తీసుకోండి. అలసిన మిమ్మల్ని దారి ప్రక్కన బావి దగ్గరికి తీసుకువచ్చిన ఆయన పట్ల కృతజులై ఉండండి.


Share this post