Skip to Content

Day 102 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు


యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దానునదినుండి తిరిగివచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి, అపవాదిచేత శోధింపబడుచుండెను

(లూకా 4:1,2).


యేసు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు. అయినప్పటికీ శోధన తప్పలేదు. శోధన అన్నది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా వస్తుంది. సైతాను లక్ష్యాలు ఎప్పుడూ అతి ఉన్నతంగా ఉంటాయి. ఒకసారైతే ఒక అపోస్తలుడి చేత యేసు ఎవరో నాకు తెలియదు అని పలికించగలిగాడు వాడు.


మార్టిన్ లూథర్ కంటే ఎక్కువసార్లు సైతానుతో ఘర్షణకి దిగినవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో. ఎందుకు? లూథర్ ఏకంగా నరకరాజ్యం మీదే దండెత్తాడు. జాన్ బన్యన్ సైతానుపై సాధించిన విజయాలను ఎవరు వర్ణించగలరు!


ఎవరిలో అయితే ఎక్కువగా దేవుని ఆత్మ నిండి ఉంటుందో వారికి అపవాదితో ఎక్కువ పోరాటాలు తటస్థిస్తాయి. దేవుడు అందుకు సమ్మతిస్తాడు. ఎందుకంటే తుపానులు వృక్షాలకెలా మేలు చేస్తాయో, శోధనలు మన ఆత్మీయ జీవితాలకు అలా మేలు చేస్తాయి. వేరు లోతుగా తన్నడానికి సహాయపడతాయి ఈ తుపానులు. పింగాణీని కాల్చడం వల్ల ఆ పాత్ర సౌష్టవం శాశ్వతమవుతుంది కదా.


నువ్వు క్రీస్తు చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నావని, ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడని నీకు తెలియదు. సైతాను తన శక్తినంతా ఉపయోగించి నిన్ను రెండో వైపుకి లాగుతున్నప్పుడు క్రీస్తు నిన్ను తన వైపుకి లాక్కోవడం తెలుస్తుంది.


అసాధారణమైన కష్టాలు వస్తే అవి మనం చేసిన అసాధారణమైన పాపాలకు ప్రతిఫలం అని భావించకూడదు. కొన్నిసార్లు అవి అసాధారణమైన కృపకు ప్రతిరూపాలే. తన ఆభరణాలను మెరుగు పెట్టడానికి దేవుని దగ్గర పదును గల పరికరాలు చాలా ఉంటాయి. ఆయన ప్రత్యేకంగా ప్రేమించి ఎవరినైతే ఎక్కువ తళతళలాడేలా చెయ్యాలను కుంటాడో వాళ్ళ పైన ఎక్కువగా తన పరికరాలను వాడతాడు.


ఇది నా వ్యక్తిగత సాక్ష్యం. దేవుడి కర్మాగారంలోని కొలిమికీ, సుత్తులకీ సానబెట్టే పరికరాలకీ నేను ఋణపడి ఉన్నాను. అసలు బెత్తం ద్వారా తప్ప నాకై నేనంటూ నేర్చుకున్నదేదైనా ఉందా అని నా అనుమానం. నేను శిక్షణ పొందుతున్న గదిలో చీకటి క్రమ్మిన వేళల్లో నేను స్పష్టంగా చూడగలను.


Share this post