Skip to Content

Day 10 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

24 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్దాత్మ వారినాటంకపరిచినందున. . . (అపో. కా.16: 6).


దేవుడు ఆ రోజుల్లో అపోస్తలులను నడిపించిన తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఆ నడిపింపు ఎక్కువ భాగము అడ్డగింపులతోనే నిండి ఉంది. చాలా సార్లు దారి తప్పుతూ వెళ్లారు ఈ అపోస్తలులు. ఎడమవైపుకి తిరిగి ఆసియా వెళ్తుంటే దేవుడు వాళ్ళని ఆపాడు. కుడివైపుకి తిరిగి బితూనియకి వెళుతుంటే మళ్లీ ఆపాడు. తరువాత కాలంలో పౌలు జీవితం మొత్తానికి గర్వించదగ్గ సేవను ఆ ప్రదేశాల్లో చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం పరిశుద్ధాత్మ ఆ తలుపుల్ని మూసి ఉంచాడు. సైతాను పదిలంగా కట్టుకున్న ఆ దుర్భేద్యమైన కోటగోడల్ని కూల్చే సమయం ఇంకా రాలేదు. ఆ పనికోసం అపోల్లో వచ్చి చేరవలసి ఉంది. ఇప్పుడు పాలు, బర్నబాల అవసరం మరొకచోట వుంది. ఆసియాలో సువార్త చెప్పడంలాంటి బాధ్యతాయుతమైన పనికోసం వాళ్లకింకా శిక్షణ అవసరం.


నీవు వెళ్ళవలసిన దాని గురించి ఏమన్నా సందేహముంటే దాన్ని వెంటనే ప్రభువుకి అప్పగించు. వెళ్ళవలసిన ద్వారం తప్ప మిగతా తలుపులన్నింటిని మూసేయ్యమని ఆయన్నడుగు.


"ఓ పరిశుద్ధాత్మ దేవా, దేవుని చిత్తంకానీ దారుల్లో నా అడుగులు పడకుండా ఆ దారులన్నింటిని మూసేసే బాధ్యత పూర్తిగా నీకే వదులుతున్నాను. నేను కుడి పక్కకైనా ఎడమ ప్రక్కకైనా తిరిగితే నా వెనుకనుండి నీ స్వరం వినిపించు" అంటూ ప్రార్ధించు.


ఈ లోపల నువ్వు నడుస్తున్న దారిలోనే సాగిపో. నీకు అందిన పిలుపుకి లోబడే ఉండు. పౌలుకి పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని ఎలా బోధించాడో నీకు కూడా అదేవిధంగా బోధించాలని ఎదురుచూస్తున్నాడు. అయితే ఆయన నిన్ను ఒక పని చేయనివ్వకుండా ఏ మాత్రం అడ్డుపెట్టిన విధేయుడవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నమ్మకం కలిగి ప్రార్థన చేసిన తర్వాత అడ్డంకులేవీ కనిపించని పక్షంలో తేలిక హృదయంతో ముందడుగు వెయ్యి. కొన్నిసార్లు నీ ప్రార్ధనకి జవాబుగా ఒక తలుపు మూసుకుపోతే ఆశ్చర్యపోవద్దు. ఎడమకి కుడికి వెళ్లే తలుపులు మూసుకుపోతే త్రోయ ప్రదేశానికి వెళ్లే తలుపు తెరిచి ఉంటుంది. అక్కడ లూకా మీకోసం ఎదురు చూస్తున్నాడు. దర్శనాలు మీకు కర్తవ్యాన్ని బోధిస్తాయి. అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్నేహితులు మీకోసం ఎదురుచూస్తున్నారు.


నీ జీవితంలో విడదీయరాని చిక్కుందా

చేదించలేని రహస్యపు దిక్కుందా

నిజాలు వెలికి తీసే దేవుడున్నాడు

ఆయన చేతిలోనే ఆ తాళముంది


తండ్రిచేత మూయబడిన తలుపు నీ ముందుందా

అది తెరుచుకొవాలని నీ అంతరంగం ఉవ్విలళ్ళూరుతుందా

ఆయనే ఆ తలుపు మూసినవాడు

అది తిరిగి తీసేవాడుఆయనే చూడు


నేమ్మదిగల దేవునిపట్ల ఓర్పుగలిగి ఉండవద్దా

సర్వజ్ఞాని ఆయనేననడానికి అబ్బ్యంతరముందా

నీ భవిష్యజీవితం నిర్ణయించినవాడు

ఆయనే దాని తలుపుల్ని తెరిచేవాడు


ధన్యకరమైన తాళం చెవి

ఆయన దగ్గరుందనిగుర్తిస్తే

కడకు నీకే అది లబిస్తుంది

ధన్యత ఆదరణ విశ్రాంతిగా మారుతుంది


Share this post