Skip to Content

వివాహ బంధం 4

20 July 2024 by
Sajeeva Vahini
  • Author: Bharathi Devadanam
  • Category: Family
  • Reference: Sajeeva Vahini Jun - Jul 2011 Vol 1 - Issue 5

క్రైస్తవ కుటుంబ వ్యవస్థలో, ముఖ్యంగా భార్యా భర్తల వివాహ బంధంలో పిల్లల పాత్ర ఏమిటి? పిల్లల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలు ఏంతో ప్రాముఖ్యమైనవి. కుటుంబానికి కేంద్ర బిందువు ఏమిటి? కుటుంబం దేనిమీద ఆధారపడి క్రీస్తుకు నచ్చిన విధంగా నడుచుకోగలదు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఎక్కువ శాతం కుటుంబానికి కేంద్రబిందువు పిల్లలు, పిల్లల కోసమే బ్రతుకుతున్నాము, వారి సంతోషమే మా సంతోషం అని చెప్తారు. కాని లోతుగా ఆలోచిస్తే అది సరియైనది కాదు అని అర్ధం చేసుకుంటాము. వివాహ బంధంలో భార్య భర్తల మధ్య దేవుని వాక్యమునకు విధేయత, ప్రేమ, సహకారము, నమ్మకంతో కూడిన బంధమే నిజంగా క్రైస్తవ కుటుంబానికి కేంద్ర బిందువుగా వుండాలి.

కొన్ని వేల సంవత్సరాల క్రితం పాలస్తీనాలో జరిగిన ఒక కుటుంబ గాధ, బైబిలు లో వ్రాయబడింది. అది మనకు కొన్ని సూచనలు ఇస్తున్నది. ఇస్సాకురిబ్కాలు భార్య భర్తలు. వారికి ఇద్దరు కుమారులు ఏశావుయాకోబు. అయితే ఆది 25:28 లో “ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను, గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను”. కీర్తనలు 127:3 లో “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము” అని వ్రాయబడియుంది. అంటే దేవుడు ఇచ్చిన స్వాస్థ్యమును లేక బహుమానములను తల్లిదండ్రులిద్దరూ సమానంగా ప్రేమించలేక పోయారు. పిల్లలను ప్రేమించే విషయంలో వారిద్దరి మధ్య ఏక మనస్సు లేదు. కాబట్టి పిల్లలు ఆ కుటుంబానికి కేంద్ర బిందువుగా మారారు. ఏశావును మాత్రమే ఆశీర్వదించాలని ఇస్సాకు ఆశ, యాకోబును ఆ ఆశీర్వాదములకు వారసుడిని చేయాలని రిబ్కా తహ తహ. ఆ కుటుంబ వ్యవస్థను ఛిన్నా భిన్నం చేసాయి. రిబ్కా యాకోబును ఎంతగా ప్రేమించింది అంటే, భర్తను మోసం చేయడానికి కూడా వెనుకాడలేదు. ఏ రిబ్కా అయితే (ఆది 24లో) దూరమునుండి యజమానుని చూచి గౌరవించి, ఒంటె మీద నుండి దిగి ముసుకు వేసుకుందో! ఆ రిబ్కా (ఆది 27లో) కళ్ళు కనపడని, ముసలివాడైన భర్త, మనిషి రోమాలకి మేక వెంట్రుకలకు తేడా తెలియని స్థితిలో ఉన్న భర్త బలహీనతను ఆధారం చేసుకొని ఆయనను మోసం చేసింది. ఆ రోజే ఆ కుటుంబం సుఖసంతోషాలకు, ప్రేమ అనురాగాలకు, కలిసి జీవించడానికి దూరం అయింది. మనకు ఇదొక హెచ్చరిక. పిల్లల ఎదుట భార్య భర్తలు ఒకరినొకరు దూషించుకుంటూ వుంటే ఒకరోజు అదే పిల్లలద్వారా వారి ఇద్దరి మధ్య బంధం బలహీనపడుతుంది. తల్లి పక్షాన చేరి తండ్రిని తృణీకరిస్తారు, లేదంటే తండ్రి పక్షాన చేరి తల్లిని కాదంటారు.

ప్రతి గృహంలో I కోరింథీ 13:4,5 “ప్రేమ దీర్ఘకాలము సహించును. దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు” అన్న వాక్యాలు నెరవేర్చబడాలి. భార్య భర్తలు కలిసి పిల్లల పెంపకం విషయంలో తగిన శ్రద్ధ చూపించాలి. పిల్లల ద్వారా భార్య భర్తల బంధం ఇంకా బలపరచబడాలి కాని బలహీనపడరాదు. పిల్లలు లేరని, పిల్లల కోసం మరొక పెళ్లి చేసుకోవడం క్రైస్తవ వివాహ బంధానికి విరుద్ధం. అది లోకందృష్టిలో తప్పులేనిదిగా ఎంచబడవచ్చు కాని క్రైస్తవులైన మనకు కాదు.

దేవుడు మన కుటుంబాలను, మన పిల్లలను ముఖ్యంగా పవిత్ర క్రైస్తవ వివాహ బంధాలను, పటిష్ఠ పరచి ఆయన కృపలో మనలను భద్రపరచును గాక.


Share this post