Skip to Content

యెడతెగక చేసే ప్రార్ధన

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

యెడతెగక చేసే ప్రార్ధన

“యెడతెగక ప్రార్థనచేయుడి” అని అపో.పౌలు థెస్సలోనికయ సంఘానికి (1 థెస్స 5:17) లో నేర్పిస్తూ ఉన్నాడు. ఈ మాటను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. యెడతెగక అంటే? ఎల్లప్పుడూ? ప్రతి నిమిషం?. ఇది ఎలా సాధ్యం? ఎవరైనా అలా చేయగలరా?. మన పనులన్నీ పక్కనబెట్టి రోజంతా కేవలం ప్రార్ధన చేయడమే కదా యెడతెగక అనే మాటకు అర్ధం.

రోజు వారి పని చేసుకోవాలి, ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి, కుటుంబాన్ని పోషించడానికి ఎదో ఒక పని, ఉద్యోగానికి వెళ్ళాలి, లేదా చదువు వ్యాపారం వంటి పనుల ఒత్తిడిలో నిమిషం తీరికలేని పరిస్థితిలో కాస్త సమయం దేవునికి కేటాయించి కాసేపు ప్రార్ధన చేసుకొని తృప్తి పడే మన ఈ జీవన ప్రస్థానం లో యెడతెగక ప్రార్ధన చేయడం అసాధ్యమే.

అపో. పౌలు అన్న మాటలను జాగ్రత్తగా నిదానించి ఆలోచన చేసినప్పుడు యెడతెగక ఎలా ప్రార్ధన చేయాలో నేర్పించాడు ఎఫెసీ 6:18 లో “ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి”. శారీరికంగా జీవించాలంటే మన శరీరానికి శ్వాస ఎంతైనా అవసరం. కొన్ని సార్లు మనం శ్వాసను తీసుకుంటున్నాము అనే విషయం తెలియకుండానే తీసుకుంటూ ఉంటాము. అదే విధంగా ఆత్మీయ జీవితానికి ప్రార్ధన శ్వాస వంటిది. ఎల్లప్పుడూ అంటే అన్ని విషయాలలో యెడతెగక ప్రార్ధాన చేయడం ద్వారా ఆత్మీయ జీవితం ఎదుగుతూ అభివృద్ధి చెందుతుంది. ఇది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం.

వ్యక్తిగత ప్రార్ధన అనుభవం లేకుండా మనల్ని గూర్చి ప్రార్ధించమని ఇతరులకు చెప్పే వాళ్ళు మనలో అనేకులు ఉన్నారు. ప్రార్ధనకు కొంత సమయం కేటాయించాలి, ప్రొద్దున కాసేపు, సాయంత్రం లేదా పడుకునే ముందు కాసేపు ప్రార్ధాన చేస్తే సరిపోతుందని ప్రార్ధనకు మనం నిర్ణయించే గడువు కాకుండా ప్రార్ధన మన జీవన శైలిగా, ప్రార్దనే మన జీవితంగా మలచుకున్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో నేరవేర్చబడతాయి. ప్రార్ధన అంటే దేవునితో సంభాషించడం. మనం నిలుచున్నా కూర్చున్నా నడుస్తున్నా సమయమందు అసమయమందు విశ్వాసంతో యెడతెగక ప్రార్ధించే అలవాటు చేసుకోవడం ఎంతైనా అవసరం, అనివార్యం మరియు ధన్యకరమని మరొకసారి జ్ఞాపకము చేస్తున్నాను. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/ubeUKCuMW5I

Share this post