Skip to Content

విశ్వాసాన్ని జీవించి చూపిద్దాం!

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

విశ్వాసాన్ని జీవించి చూపిద్దాం!

అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలు లేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును. (యాకోబు 2:18).

ఒక పేద కుటుంబంలోని చిన్న బిడ్డకు అకస్మాత్తుగా జ్వరం మొదలైంది. ఆ బిడ్డను ఎత్తుకొని ఆసుపత్రికి తీసికొని మండుటెండలో బయలుదేరిన తండ్రిని గమనించాడు కారులో ఆఫీసుకు వెళుతున్న నా స్నేహితుడు. రోజు వారిని గమనిస్తూ ఆ వైపే వెళుతున్న అతనికి వీరికి ఎదో సమస్య కలిగిందని గమనించిన నా స్నేహితుడు తన కారును ఆపి వారిని ఎక్కించుకొని సకాలంలో ఆసుపత్రికి చేర్చాడు. నా దగ్గర డబ్బులు లేని కారణంగా మండుటెండలో జ్వరముతో బాధపడుతున్న నా బిడ్డను ఎత్తుకొని ఎన్నో మైళ్ళు నడిచి వెళ్ళలేని నాకు మీ సహాయం ఎంతో ఉపయోగపడిందని నా స్నేహితునికి కన్నీళ్లతో తన ఆనందాన్ని పంచుకున్నాడు ఆ వ్యక్తి.

తమ క్రియలద్వారా విశ్వాసాన్ని చూపించమని యాకోబు ఇచ్చిన హెచ్చరికను, నా స్నేహితుడు అధునాతన పరిస్థితిలో ఆచరణలో పెట్టాడు. ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. (యాకోబు 2:17). సంఘము విధవరాళ్ళను గురించి, దిక్కులేని పిల్లలను గురించి శ్రద్ధకలిగి యుండాలని ఆయన చింతపడే వాడు.(యాకోబు 1:27). వట్టి మాటలపై ఆధారపడక, ప్రేమ కలిగి క్రియలద్వారా తమ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టాలని ఆశపడ్డాడు.

మనము క్రియలవలనగాక విశ్వాసము వలన రక్షింపబడ్డాము, అయితే ఇతరులను ప్రేమించి వారి అవసరతల విషయమై శ్రద్ధకలిగియుండడంలో మన విశ్వాసాన్ని ఆచరణలో పెడతాము. కారులో ఎక్కించుకున్న నా స్నేహితునివలె, ఈ లోకంలో కలిసి ప్రయాణము చేస్తున్నప్పుడు, మన సహాయము అవసరమైనవారు ఉన్నారేమోనని గమనిక కలిగియుందుము గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/oWjC4qUmdy8


Share this post