Skip to Content

తలదించకు

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Pas. Anil Andrewz | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

తలదించకు

జీవితం ఎప్పుడు మనం ఊహించినట్ల ఉండదు. ఊహించని విధముగా పరిస్థితులు మారిపోతుంటాయి. విశ్వాస జీవితములోనైతే అలా ఎలా జరిగిందో కూడా ఊహకే అంతుచిక్కదు. ఈ రోజు ఎందుకు ఈ మాటలు చెప్పుతున్నానంటే? 

(నిర్గమా 2:13,14; అ.పో 7:26-35) ఒక రోజు హెబ్రీయులైన మనుష్యులిద్దరు పోట్లాడుచున్నప్పుడు మోషే అన్యాయము చేసినవాని చూచి నీవేల నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడిగినప్పుడు;  అన్యాయము చేసిన హెబ్రీయుడు మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడని ప్రశ్నించాడు. కొన్ని రోజుల తరువాత అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడని వారు నిరాకరించిన మోషేను దేవుడే, వారిపైన అధికారిని గాను విమోచకునిగాను నియమించాడు. 

(ఆది 37:8; 50:18) యోసేపు చెప్పిన కల విని అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మామీద నీవు అధికారివగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలనుబట్టియు అతనిమీద మరింత పగపట్టారు. కాని, తరువాత విమర్శించిన సహోదరులు యోసేపు యెదుట సాగిలపడి మేము నీకు దాసులమని చెప్పారు.

పేతురు 2:20 లో మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరని పేతురు తెలియజేసాడు.  విశ్వాస జీవితములో నిందలు, అవమానములు, శ్రమలు మొ।। ఆశీర్వాదములే కాని శాపం కాదు. ఈ రోజు నీవు నిందించబడుతుండవచ్చు, విమర్శించబడుతుండవచ్చు కాని, సహిస్తే రేపు నీవే దేవుని చేతిలో భూషణకిరీటముగాను, రాజకీయ మకుటముగాను ఉంటావు.

ద్వితీ.కాం 28:14 నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.

ఇంత అద్భుతమైన వాగ్ధానములు మనకుండగా ఎదుటివారిని విమర్శించేప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నీవు విమర్శించినవాడు నీపై అధికారిగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఏ పొరపాటు లేకుండా నీవు విమర్శించబడుతుంటే దిగులుపడకు, కృంగిపోవద్దు దేవుడి నిన్ను తలగా నియమించుటకు, పైవాడవుగా ఉండుటకు ఒక దినము నియమించాడు ఆ దినం నీ ముందుంది.

ఎన్ని అవమానములు ఉన్నా, సమస్యలు నిన్ను భయపెట్టినా నీ తల ఎత్తేవాడు నీ ముందు ఉండగా భయపడి తలదించకు. యోసేపు కీడు చేసిన సహోదరులకు  ప్రతి కీడు చేయుటకు ఆలోచించినట్లు బైబిల్లో లేదు, తన దృష్టంతా గురి మీదనే, దేవుడిచ్చిన దర్శనం మీదనే నిలిపాడు, తగిన సమయంలో దేవుడు హెచ్చించాడు. తనను విమర్శించిన వారి మీద మోషే కోపం పెట్టుకోలేదు కాని, దేవుడు పిలిచినప్పుడు విమర్శించిన వారి ముందుండి చక్కని మార్గమున వారిని నడిపించాడు. దేవుడు నిన్ను సహించుటకే పిలిచాడు, సహిస్తేనే ఏలుతావు.

Telugu Audio: https://youtu.be/EVg3h6X_7V4?si=Ey6_pUbAoe9YyjuZ

Share this post