Skip to Content

పొగ త్రాగరాదు

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

పొగ త్రాగరాదు

ఏంట్రా సిగరెట్టూ తాగి ఇంటికి వచ్చావా అని కొడుకును ప్రశ్నించాడు తండ్రి. అవును అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు పెద్ద వయసొచ్చిన తన ఏకైన కుమారుడు. పాస్టర్ కొడుకువైయుండి ఎంటా పాడు అలవాటులు అంటూ గద్దించడం ప్రారంభించాడు; తండ్రి మాటలను కొట్టి పారేస్తూ అసలు "పొగ త్రాగరాదు" అని బైబిల్ లో ఉందొ లేదో చెప్పు, నాకు చూపిస్తే ఇప్పుడే మానేస్తా అన్నాడు హేళనతో కుమారుడు. తండ్రి కుమారుల మధ్య వాగ్వివాదం పెరిగి పెరిగి పెద్దదైంది. ఎంతో మందికి చెప్పే నేను, నా కొడుకుకు మాత్రం చెప్పలేకపోతున్నాను అని ఆలోచిస్తున్న తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. నా కుమారుడా బైబిలును స్పష్టంగా పాటిస్తున్నావు! చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు, బైబిలును క్షుణ్ణంగా తెలుసుకున్న నిన్ను బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే "పొగ త్రాగరాదు" అని బైబిలులో వ్రాయలేదు, వాస్తవమే అయినా పొగ త్రాగమని మాత్రం వ్రాయబడలేదు కదా, లేని విషయం కోసం ఆరాటపడుతూ నీవెందుకు నీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటావు అంటూ కుమారుణ్ణి చిక్కు ప్రశ్నలతో ముడివేసాడు ఆ పాస్టర్ గారైన తండ్రి.

బిడ్డలు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారంటే పొరపాటు వారి పెంపకంలోనే కదా. మొక్కై వంగనిది మ్రానై వంగునా చెప్పండి. ఏది మంచి ఏది చెడు అనే ప్రతీది బైబులులో వ్రాయబడలేదు. సమాజంలో పనికిరాని ప్రతి విషయాన్ని బైబులుతో జత చేసి దానికోసం ఎంతో సమయాన్ని వెచ్చించి, సంభాషించి, కాలాన్ని సమయాన్ని వృధా చేసుకునే వారిలో మనం కూడా ఉన్నామంటే ఆశ్చర్యంలేదు. ఇది చేస్తే మంచి ఇది చేస్తే చెడు అనే వ్యత్యాసాన్ని చిన్న నాటి నుండే ఓపికతో, ప్రేమతో, గద్దింపుతో తల్లిదంద్రులమైన మనం నేర్పిస్తేనే కదా వారు ఎదిగే కొద్దీ భయం బాధ్యత అలవరచుకుంటారు. నిర్లక్ష్యం, మాట వినని తనం ఇవన్ని అవిధేయతకు ఉదాహరణాలు. జీవితాన్ని, ఆరోగ్యాన్ని పాడుచేసి చివరకు దైనందిక మరియు కుటుంబ జీవితాన్ని అది విచ్చిన్నం చేస్తుందంటే అందులో ఆశ్చర్యమే లేదు. దేవుడు కూడా అసహ్యించుకునే ఈ అవిధేయత శాపానికి మరణానికి కూడా దారి తీస్తుందంటే అందులో సందేహమే లేదు. "బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" సామెతలు 22:6.

జీవితాన్ని ఎలా కట్టుకోవాలో చిన్న నాటి నుండి నేర్పిస్తేనే ఆ బిడ్డలు ఎదిగేకొద్ది ఒదిగి జీవించడం నేర్చుకుంటారు. బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్ధించే తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులకు విధేయతనిచ్చే బిడ్డలను బట్టే, ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి ఫలించి అభివృద్ధిపరుస్తాడు. ఏది మంచి ఏది చెడు వంటివి ఈ ఆధునికమైన వ్యవస్థలో అన్నీ మనం నేర్పించలేకపోయినా, బిడ్డలకు మనం నేర్చించే దేవుని యెడల భయభక్తులు వారిని ఉన్నత మార్గం వైపు నడిపిస్తుంది. ప్రతి సమయంలో వారిని సరైన దిశ వైపు నడిపించడానికి దేవుడే సహాయం చేస్తాడు. ఈ లోకములో మరియు లోకముతో వారు జీవిస్తూ ఉన్నప్పుడు లోకమును జయించే బిడ్డలుగా ఉంటూ... అంతరంగంలో వారికి కలిగే ప్రతి ఆలోచనలకు, జీవితంలో వారు తీసుకునే ప్రతి నిర్ణయాలను పరిశుద్ధాత్మ దేవుడే వారికి బోధించి వారిని ఆశీర్వాదానికి కారకులుగా చేస్తాడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/I8-yIxuqM0U

Share this post