- Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
- Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
- Reference: Sajeeva Vahini
ఒకటి బంధిస్తే మరొకటి విడుదల!
పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. మత్తయి 16:19
మనం కేవలం శరీర సంబంధమైన మనుషులం మాత్రమే కాదు గాని, ఆత్మసంబంధమైన విశ్వాసులం అని జ్ఞాపకం చేసుకోవాలి. శారీరికంగా జీవిస్తూ ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేయగల సమర్ధులం. ఇది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. ఆధ్యాత్మికంగా మనం ఉంటూ ప్రార్ధన ద్వారా గొప్ప మార్పులు అద్భుతాలు చేయగలం. దేవుడు ఆత్మ గనుక..! (యోహాను 4:24), మన ప్రతి ప్రార్ధన, ప్రతి సమాధానం అన్నీ ఆత్మలో ఆయన ద్వారానే పొందుకోగలం.
యేసు క్రీస్తు ప్రభువు పేతురుతో అన్నమాటలను మనం చదువుతూ ఉన్నప్పుడు, పేతురుకు దేవుడు పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు. ప్రతి తాళంచెవి పరలోక ద్వారాలను తెరిచేవిగా ఉన్నాయి. ఒక్కో తాళంచెవి ఒక్కో విధమైన ప్రార్ధనకు సాదృశ్యంగా ఉంది. ఈ మాటలను బోధిస్తూ ఒక్కో తాళంచెవి దేనినైనా బంధించగల శక్తి, దేనినైనా విడిపించగల శక్తి ఉందని, ఈ రెండు ప్రక్రియలు కేవలం ప్రార్ధన అనే ఒకే సిద్ధాంతంతో ముడి పడి ఉన్నవి అని ఆనాడు పేతురుకు నేర్పిస్తూ నేడు మనకును ఈ ప్రార్ధనకు ఉన్న శక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు.
మనం ప్రార్ధన చేస్తున్నప్పుడు ఇతరులకొరకైనాలేదా మనకొరకైనా అది బంధకాల్లో సమస్యల్లో శ్రమలలో అనారోగ్యములో నష్టములలో నుండి విడిపించబడి విడుదల దయజేస్తుంది. కేవలం ఒకే ఒక ప్రార్ధన ఒకవైపు అపవాదిని దాని క్రియలను బంధిస్తూ, ఆధ్యాత్మికమైన దేవుని శక్తి సామర్ధ్యాల వలన భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఈ అనుభవంగుండా ప్రయాణించడమే దేవుని చిత్తం. ఆమెన్.
Telugu Audio: https://youtu.be/mI2JDUpuFfc