Skip to Content

నిష్కళంకమునైన భక్తి

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

నిష్కళంకమునైన భక్తి

ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీలో ఒక చిన్న చర్చి ఉంది. ఆ సంఘ సభ్యురాలు కేజియా... నర్సుగా పనిచేస్తూ దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉండేది. అనుకోకుండా ఒక రోజు అదే సంఘంలో విశ్వాసియైన ఒక సహోదరికి తెలియని ఒక వ్యాధి కలిగిందని గుర్తించింది కేజియా. నరాలను కండరాలను బిగపట్టేసే ఆ వ్యాధి, చివరకు ఆ సహోదరిని పక్షవాయువుకు గురిచేసింది. ఆర్ధిక మాంద్యం, సరైన వసతులు లేని పరిస్తితిలో ఆ సహోదరి కష్టపడిపోతున్న తీరు చూసి కేజియా గుండె కరిగిపోయింది. ఏమి చేయలేని పరిస్థితులు ఒకవైపు ఉంటే ఆ సహో దరికి ఏదైనా చిన్న సహాయం చేయాలని ఆలోచించి, ప్రతి రోజు తన ఇంటికి వెళ్లి పరామర్శించి తాను నేర్చుకున్న వైద్య సేవలు అందించింది. కొన్ని దినములు గడుస్తూ ఉండగా కేజియాకు వేరే ప్రాంతానికి బదిలీ అవ్వడంతో ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవలసి వస్తే, తన సేవను మధ్యలోనే వదిలిపెట్టక తోటి సంఘములోని యవనస్తులను ప్రోత్సాహించి ఎలా సహాయపడాలో నేర్పించింది. తోటివారికి సహాయం చేయాలనే తన ఆలోచన అనేకమందికి శిక్షణ ఇస్తూ వారిని ప్రోత్సాహ పరచింది.

మన చుట్టూ ఉండేవారు మన సహోదరులు సహోదరీలని యోహాను బోధిస్తూ “దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెను (1 యోహాను 4:21) అన్నాడు. ఇటువంటి ప్రేమకు కేజియా ఉదాహరణగా ఉంది. కేజియా అనగా “పరిమళ వాసన” తన పేరుకు తగినట్టుగా తన చుట్టూ ఉన్నవారికి సహాయం చేస్తూ ప్రేమ పరిమళాలను వెదజల్లింది.

ప్రస్తుత దినములలో ఎన్నో సమస్యలతో, ఎంతో కష్టంలో, బాధల్లొ, ఇబ్బందులలో మన చుట్టూ ఉండే వారు లేదా మన సంఘంలో ఎందరో ఉన్నారు. వందమందికి మనం సహాయం చేయాలనే ఉద్దేశం కాదు, కనీసం ఒక్కరికైనా సహాయం చేయగలిగితే క్రీస్తు ప్రేమలో పాలుపొందిన వారమవుతాము. నాకు సంబంధం లేదు అనుకోకుండా, ఇబ్బందులలో ఉన్నవారి కొరకు ప్రార్ధన చేసి వీలైతే వారిని దర్శించి వారికి మనం చేయగలిగినంత సహాయం చేయడం క్రైస్తవ విశ్వాసంలో అత్యున్నతమైనది. యాకోబు (1:27) అంటాడు “తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే” అని జ్ఞాపకము చేస్తున్నాడు. అంతేకాదు, (మత్త 25:40) మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని యేసు ప్రభువు కుడా బోధించాడు. ఇతరులకు సహాయం చేయాలనే మంచి మనసు ప్రభువు మనందరికీ అనుగ్రహించుకు గాక. ఆమెన్

Telugu Audio: https://youtu.be/IXUrg2Eammo?si=H0s873So09PBlheE

Share this post