Skip to Content

క్రైస్తవ్యం మతమా? నాకొద్దు!!

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

క్రైస్తవ్యం మతమా? నాకొద్దు!!

క్రైస్తవ విశ్వాసం అంటే మతం కాదు మార్గం - అని అనేక సార్లు బోధించాను. ఈ మాట వాస్తవమే అయినప్పటికీ, మన చుట్టూ ఉన్నవారికి వివరించాలంటే చాలా కష్టం. ఫలానా వ్యక్తి, క్రైస్తవ మతంలో దిగాడంటా, ఆమె క్రైస్తవ మతం పుచ్చుకుందంటా అనే మాటలు మనం ఎప్పుడు వినేవే కదా. మత మార్పిడి మత మార్పిడి అనే మాట మారుమ్రోగుతూనే వుంటుంది. 

నేను నేర్చుకున్న నా అనుభవంలో క్రైస్తవ్యం అంటే యేసు క్రీస్తుతో మనకు ఉండే సంబంధం. మతం లోకం పెట్టిన పేరు, మతం ఒక మౌడ్యం, మతం ఒక విభేదం, అది ఒక పక్షపాతం. క్రీస్తు ఎప్పుడూ నాదొక మతము, నేనే మతము అనలేదు; ననే మార్గము అన్నాడు.  మతముతో, మతాచారాలతో పోరాటమే క్రీస్తు జీవితము.  తన మార్గాన్ని త్రుణీకరించిన వారితో గాని, తన మార్గాన్ని వ్యతిరేకించిన వారితో గాని క్రీస్తు పోరాడలేదు గాని క్రీస్తే మత సిద్ధాంతాల సవరణకు, మతాచారాల నిర్మూలనకు పూనుకొని మతోన్మాదుల చేతిలో బలియైపోయాడు.   మతం కోసం క్రీస్తు మరణించలేదు గాని, మతమే క్రీస్తును సిలువ వేసింది.

ఒకవేళ క్రైస్తవ్యం మిమ్మల్ని వ్యయపరుస్తున్నట్టు గాని, మీలో శక్తినంతా ఎగిరిపోయేటట్లు చేస్తుందని గాని మీకు అనిపిస్తే, అప్పుడు మీరు మతం అనే ఆచారాలలో చిక్కుకున్నారే తప్ప యేసు క్రీస్తుతో ఆత్మీయ సంబంధాన్ని ఆస్వాదించలేక పోతున్నారన్నమాట.

క్రీస్తును విశ్వసించడానికి, క్రీస్తుతో నడవడానికి మతంతో పని లేదు, మనకు కావలసింది కేవలం ఆయనపై విశ్వాసం మాత్రమే. యేసుక్రీస్తుతో మీ నడక మిమ్మును ఎన్నడు అలసిపోయేటట్లు చేయదు; అది మీకు తృప్తినిస్తుంది, మీ శక్తిని పునరుద్ధరిస్తుంది, మీ జీవితాన్ని శక్తివంతం చేస్తుంది. మత్తయి 11:28-29 “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.”

యేసు ప్రభువు ఆహ్వానం నీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది “నీవు అలసిపోయావా? మతం విషయమై దహించుకుపోయావా? నాతో నడిచి నాతో పని చెయ్యి...కృప యొక్క బలవంతపెట్టని క్రియలను నేర్చుకో!!” అంటున్నాడు. అయితే, ఏ భారాన్నైతే మోస్తు జీవన పయనంలో నడుస్తున్నామో, ఏ నెమ్మది పొందాలని మన జీవితాన్నంతా వ్యయపరచుకుంటున్నామో వాటిని మోసేటంత శక్తి, భారం, యేసు క్రీస్తు దగ్గరకు వచ్చినపుడే దొరుకుతాయి. ఇదే క్రీస్తును మనకు - మనల్ని క్రీస్తుకు దగ్గర చేసి నడిపించే మార్గం. క్రైస్తవ మతంలో నేను ఉన్నాను అని నీకు అనిపిస్తే మొదట ఆ మతాన్ని క్రిందకు దించి క్రీస్తుతో నడవడానికి ప్రయత్నించి చూడు. ఈ విశ్వాస ప్రయాణంలో క్రొత్త కోణాన్ని చూస్తావు.

Telugu Audio: https://youtu.be/bfJo1dRdP4g

Share this post