Skip to Content

కొంచెం కష్టం, కాస్త సంతోషం

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

కొంచెం కష్టం, కాస్త సంతోషం

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. రోమా 8:28

మనకు ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది అని అపో.పౌలు ఈ వాక్యంలో వ్రాయలేదు కాని, సమస్తము సమకూడినప్పుడు జరిగేవన్నీ మన మేలుకొరకే అంటాడు.

ఆఫీసుకు వెల్దాం అనుకొని ఇంట్లో నుండి అడుగు బయటకు పెట్టగానే అనుకోకుండా మన స్కూటరు స్టార్ట్ అవ్వలేదనుకోండి. వెంటనే మన ఆలోచనల్లో తట్టేది ఆటంకాలు!. ఛః ఈ రోజు నాకు మంచి రోజులా లేదే, ఆలస్యంగా వెళ్తే ఆఫీసులో మా బాస్ ఏమంటాడో, ఎన్నో పనులు ఉన్నాయి వాటన్నిటికి ఆటంకాలే; కేవలం ఇదే కాకపోయినా కాస్త ఇలానే జరగాలనుకున్నవి జరగలేకపోయాయనే నిరాశలో కాస్త చిరాకును కలిపి... ఆలోచిస్తూ ఉంటాము.  లేదంటే, అయ్యో వెళ్లలేకపోయానే, ఇక చేయల్సించి ఏమి లేదు, నా స్కూటరును రిపేరు చేయించుకొని, వేరే ఇంకేమైనా పనులు చూసుకొని ఆఫీసుకు సెలవు పెట్టేస్తే పరవాలేదులే అనికూడా అలోచించవచ్చు. ఏది ఏమైనా, ఏది మంచి - ఏది చెడు, ఏది ప్రాముఖ్యం - ఏది ముఖ్యం కాదు, ఏది కోరక - ఏది అవసరం. వీటిమధ్య ఉన్న దూరాలు మన ఆలోచనలను బట్టే ఉంటాయి. బహుశా ఈ రోజు కాస్త విశ్రాంతి తీసుకొని కొంత సమయం మనకొరకు లేదా మన కుటుంబ సభ్యులకోరకు కొంత సమయాన్ని గడపాలని, ఇంకొంత సమయం ప్రార్ధించడానికి అలా జరిగి యుండవచ్చును గదా. 

అపో. పౌలు తన అనుభవాన్ని మనకు రోమా 12:16 లో నేర్పిస్తూ “హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి” అంటున్నాడు. అంటే జరగలేనటువంటి వాటిపై దృష్టి సారించక జరగే వాటిపై మనస్సు పెడితే నిరాశపడక సమస్తము మనమంచికే జరుగుతుంది అనే అనుభవం లోనికి నడిపిస్తుంది. 

ప్రియమైన స్నేహితులారా, మీరేమి నిర్ణయించుకుంటారో అది మీ ఆలోచనలకే వదిలేస్తున్నాను. అనేక సార్లు మనం పొందుకోవాలకునేవన్నీ మనం సాధించలేము, మన ఆలోచనలే మన బలహీనతలు, పొందుకోలేకపోయామనే నిరాశ కృంగుదల, వీటిలోనుండి వచ్చేవి కోపాలు చిరాకు చివరకు నిస్సహాయ స్థితి నేను పనికిరానివాడనేమో అనే ప్రతికూల భావన. ఈ ప్రతికూలత నుండి విడుదల పొందే మార్గం, మనం సమస్యను ఎదుర్కొన్నప్పుడు ప్రారంభమవుతుంది. ఈ అనుభవం.. దేవుడు దాని నుండి తప్పిస్తాడనే నమ్మకాన్ని కలుగజేస్తుంది, సమస్య నుండి విడిపిస్తుంది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏది ఏమైనా అది నా మంచికొరకే, నేను నేర్చుకొనుట కొరకే, నన్ను నేను కట్టుకొనుట కొరకే అని ఆలోచన చేసినప్పుడు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మనకు సమస్తము అంటే కొంచెం కష్టం, కాస్త సంతోషం ఇవన్నీ సమకూడి మంచివిగా మేలైనవిగా ఆశీర్వాదాలుగా మార్చబడుతాయి.  ఆమెన్.

Telugu Audio: https://www.youtube.com/watch?v=nfP9jrzQpeA

Share this post