- Author: Anudina Vahini | Pas. Anil Andrewz | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
- Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
- Reference: Sajeeva Vahini
ఏది విశ్వాసికి విజయం?
ఈ లోకంలోని విజయానికి విశ్వాస జీవితములోని విజయానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోకంలో మంచి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఇల్లు సంపాదిస్తే జీవితంలో విజయం సాధించాడు అంటారు. ఎదుటి వ్యక్తిని జయిస్తే విజయం, శత్రువును చంపితే విజయం అంటారు.కానీ, విశ్వాసా జీవితంలోని విజయాలు వేరుగా ఉంటాయి. క్రీస్తుకొరకు అన్ని విడిచిపెట్టితే నీవు విజయం సాధించినట్లే, నీ శత్రువును ప్రేమిస్తే విజయవంతుడవు.
ఎదిరించక తగ్గించుకుంటేనే మనం గెలిచినట్లు . చాలామంది ఇస్సాకు గెరారు ప్రాంతములో నూరంతలు ఫలం పొందిన సందర్భాన్ని జ్ఞాపకం చేసి ఇస్సాకు వలె మనం కూడా విజయం సాధించాలని, సాధిస్తావని దీవిస్తారు. కాని ఇది విజయం కాదు, అసలు విజయం ముందుంది.
ఆ ప్రాంత ప్రజలు ఇస్సాకు మీద అసూయపడి వెళ్లగొట్టి తన తండ్రి త్రవించిన బావులు, తాను త్రవ్విన బావులను పూడ్చివేశారు. ఈ పరిస్థితిలో ఇస్సాకు వారిని ఎదిరించలేదు కానీ, తగ్గించుకొని వెళ్ళిపోయాడు. ఇటువంటి పరిస్థితులలో నేను ఓడిపోయానని ఇస్సాకు ఏడ్వలేదు కాని,బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసాడు. ఎప్పుడైతే ఇస్సాకు తగించుకొని ఎదిరించక వెళ్ళిపోయాడో ... (ఆది 26:28-31) వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితివిు ...ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి.
ఇస్సాకు నూరంతలు ఫలం పొందినప్పుడు ఈ మాటలు వారు పలకలేదు కాని, తగ్గించుకొనినప్పుడే వారు దేవుని ఘనపరిచారు. ఇస్సాకు మీద అసూయపడి వెళ్లగొట్టినవారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ...అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి ...ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.
ఇస్సాకు వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు లేదా వారిని వెళ్లగొట్టలేదు కానీ, వారికి భోజనం పెట్టాడు వారిని సమాధానముగా పంపించాడు.
మన కూడి మన ఆత్మీయ జీవితంలో ఎదురైయ్యే శ్రమలు నిందలు అవమానములలో తగ్గించుకొని, శత్రువుకి భోజనం పెట్టి, వారిని అవమానించక సమాధానముగా పంపించగలమా?అలా చేయగలిగితేనే మనం విజయం సాధించినట్లు
ఎఫెసీ 4:1-2 కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని పౌలు బతిమాలి చెప్పాడు.
ఇదే నిజమైన విజయం.
Telugu Audio: https://youtu.be/c6CT6h9vGe4?si=VKTDqUSfJKjT-Ttp