Skip to Content

పాపమరణం నుండి - విజయోత్సవము

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

పాపమరణం నుండి - విజయోత్సవము

యోహాను 3:8 ...అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.

అపవాది యొక్క క్రియలు ఏమిటి? 1. పాపం 2. మరణం

పాపం యొక్క క్రీయాల గురించి గమనిస్తే - తీతుకు 3:3 ప్రకారం మన మునుపటి జీవితం ఎంత అసహ్యమైనదో వివరించబడినది. 1. అవివేకులము అనగా తెలివిలేనివారము. నిజ దేవుని ఎరుగక లోకంవెంట తెలివిలేక పరుగెత్తాము. 2. అవిధేయులము అనగా మొండి హృదయము కలిగి దేవునిపై తిరుగుబాటు చేసాము. 3. మోసపోయిన వారము అనగా ఇది నిజమా అని దేవుని సందేహించేలాగా చేసే సాతాను ప్రశ్నల చేత మోసగించబడినాము. 4. అనేక రకాల దురాశలకును, సుఖ భోగములకు బానిసలముగా ఉన్నాము. 5. చెడు ఆలోచనలతోను, ఒకరిపై ఒకరం అసూయతోను, ఒకరికొరం ద్వేషించుకుంటూ అసహ్యమైన జీవితం జీవించాము.

ఇవన్ని అపవాది యొక్క పాపపు క్రియలు. ఈ పాపపు క్రియలకు బానిసలమైపోయాము. ఇటువంటి పాపపు క్రియలలో బంధీలమైపోయాము. విడిపించబడే మార్గం తెలియక నలిగిపోయాము.

మరొక అపవాది క్రియ మరణం. హెబ్రీ 2:14,15 ప్రకారం జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడియున్నాము. అపవాది మరణం బలముచేత మనలను లోబరచుకున్నాడు. ప్రతి దినము భయం భయంగా ప్రారంభించాము. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక భయంతో సహవాసం చేసాము. ఇలాంటి పాపం, మరణం అనే క్రియలచేత మనం బంధించబడియున్నాము.

అందుకనే పాపము నుండి, మరణ భయము నుండి విడిపించుటకు; అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకు 2000 సం।।ల క్రితం యేసు ప్రభువు రక్తమాంసములలో పాలివాడయ్యాడు అనగా నరరూపిగా పశులపాకలో మన కొరకు జన్మించాడు.

అపవాది క్రియలను లయపరచుటకే కాదు అపవాదిని మన కాళ్లక్రింద చితుక త్రొక్కించుటకే యేసు ప్రభువు జయించి ఆ విజయమును మనకనుగ్రహించాడు.

ఇప్పుడు నీవు ఓడిపోయినవాడవు కాదు క్రీస్తులో విజమవంతుడవు.

Telugu Audio: https://youtu.be/tjmNkz-J5l8 

Share this post