Skip to Content

క్రీస్తులో విజయోత్సవము

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

క్రీస్తులో విజయోత్సవము - 2 కొరింథీ 2:14-16

నిర్దోషమైనదానిని యాజకుడు బలిపీఠంపై అర్పించినప్పుడు, అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దహనబలి సువాసనను దేవుడు ఆఘ్రాణించి మనయెడల తన కనికరాన్నిచూపుతూ మనలను క్షమిస్తూఉన్నాడు. అదేరీతిగా, విరిగి నలిగిన మన హృదయాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు; మన జీవితాలు ఇంపైన సువాసనను కలుగజేసి దేవునిని సంతోషపెట్టేవిగా ఉంటాయని గ్రహించాలి. ఈ అనుభవం సజీవయాగంగా మనలను మనం సమర్పించుకున్నప్పుడే సాధ్యమవుతుంది.

క్రైస్తవులమైన మనం దేవుని కొరకు మరియు మన చుట్టూ ఉండే వారికొరకు ప్రత్యేకమైన సువాసన కలిగియున్నాము. ఎట్లనగా క్రీస్తును గూర్చిన అనుభవాలను నేర్చుకొన్న మన జీవితాలు మన ద్వారా అనేకులను క్రీస్తువైపు నడిపించే సామర్ధ్యాన్ని తన పరలోక జ్ఞానంతో నింపి - మనకు తన ఆత్మతో భోధిస్తున్నాడు. దేవాది దేవుడైయుండి - నిత్యత్వంలో ఆయన ఉన్నప్పటికీ - దేవుడు మనలను ఏర్పరచుకొని, ఎన్నుకొని మన ద్వారా ఆయన జనన మరణమును గూర్చిన ఆ పరలోక రాజ్య సువార్తను ప్రకటించాలని కోరుతున్నాడు.

మనం నేర్చుకున్న సంగతులనే కాకుండా, పరలోక సంబంధమైన మర్మాలను దేవుడు మనకు బయలుపరచి రక్షించబడిన వారికొరకును, నశించిపోయే ఆత్మలకొరకును మన జీవితాలు క్రీస్తు సువాసనయై... జీవార్థమైన జీవపు వాసనగా ఉండగలమని గ్రహించాలి. సువాసనలు వెదజల్లే దేవుని జ్ఞానము పొందిన మన అనుభవం విజయోత్సవముతో మన జీవితాలను విజయవంతులనుచేస్తుంది.

దేవుడు ఎల్లప్పుడూ క్రీస్తులో మనం విజయం పొందాలనే ఆశిస్తున్నాడు. నేనంటాను, ఇంత గొప్ప పరిచర్యను గూర్చిన సామర్ధ్యం మనలో లేకపోయినప్పటికీ, మనం సమర్థులమని తాను నియమించి, మనలోని తలాంతుల ద్వారా పరలోరాజ్య సరిహద్దులను విశాలపరచే పనిముట్టుగా దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయ!

క్రీస్తు జ్ఞానము యొక్క సువాసన వెదజల్లే మన జీవితమే... జీవన పరిమళం. ఇదే క్రీస్తులో విజయోత్సవం.

Telugu Audio: https://youtu.be/nyEX6Q4T__k 

Share this post