Skip to Content

ఇక కన్నీళ్లు ఉండవు

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

ఇక కన్నీళ్లు ఉండవు

ప్రకటన గ్రంథం 7:17 ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.

అంత్యదినములలో యేసు క్రీస్తు తాను ఏర్పరచుకున్న ప్రజలను జాగ్రత్తగా చూసుకొంటాడని, తానే వారికి కాపరిగా ఉంటూ తన ప్రజలకు అందించే ప్రేమపూర్వక సంరక్షణ మరియు మార్గనిర్దేశం చేస్తాడని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది.

యేసు క్రీస్తు మనకు తన వాక్యం ద్వారా అనుదినం జీవ జలపు ఊటలను అందిస్తున్నాడు, అది తనను విశ్వసించే వారందరికీ సమృద్ధిగా లభిస్తుంది. జీవజలము పరిశుద్ధాత్మ యొక్క రూపకము, మనము ఆయనను వెంబడించునప్పుడు మన ఆత్మలకు నెమ్మది కలిగించి మనల్ని స్థిరపరుస్తుంది. 

ఈ వాక్యం ప్రకారం, దేవుడు మనకు ఓదార్పు మరియు పునరుద్ధరణతో కూడిన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మన కన్నుల ప్రతి కన్నీటిని తుడిచివేస్తాడు. శ్రమలతో కూడిన ఈ ప్రపంచంలో, మనం అనేక బాధలను మరియు కన్నీళ్లను అనుభవిస్తాము. కానీ దేవుని రాజ్యంలో, మన శ్రమలు మరియు బాధలన్నీ తుడిచివేయబడతాయి మరియు మనం పరిపూర్ణ ఆనందం మరియు శాంతిని అనుభవిస్తామని సంపూర్ణంగా విశ్వసిద్దాం.

మన మంచి కాపరియైన యేసుపై మనం పూర్తిగా విశ్వాసం ఉంచగలిగితే ఈరోజు మనం ఎంతో ఓదార్పును పొందగలము. దేవుడు మన కన్నుల నుండి ప్రతి కన్నీటిని తుడిచే రోజు ఒకటుందని నిరీక్షణ కలిగి జీవిద్దాం. దేవుడు మీతో మనతో ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమెన్.

అనుదిన వాహినిTelugu Audio: https://youtu.be/_GXMHrO4BrU 

Share this post