Skip to Content

అంతరంగ యుద్ధం – పోరాడి గెలిస్తేనే విజయోత్సవం

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

అంతరంగ యుద్ధం – పోరాడి గెలిస్తేనే విజయోత్సవం

జీవితం ఎల్లప్పుడూ మనమీద మనకే సవాళ్ళను విసురుతూనే ఉంటుంది, వాటిని ఎదుర్కొని నిలిచినప్పుడే విజేతలవుతాము. పోరాడాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలవాలి, నీలోనే ఉన్న నీ శత్రువుపై గెలవాలి. నీపై నువ్వు గెలవడం అంటే? నువ్వు ఎదుర్కొనే ప్రతి సవాలు, నువ్వు సాధించలేవని, నువ్వు చేతకానివాడవని, నువ్వు బలహీనుడవని నిన్ను హేళన చేసినప్పుడు దానికి నువ్విచ్చే సమాధానం - నీ ధైర్యం, నీలో ఉన్న విశ్వాసమే. క్రైస్తవ విశ్వాసంలో ఒక వినూత్నమైన అనుభవం అనుదిన ప్రార్ధనలలో మన జీవితం పై మనమే పోరాడడం. విశ్వాస జీవితంలో ప్రార్ధనా పోరాటానికి వాక్యం తోడైతే ఈ అంతరంగ యుద్దంలో అంతిమ విజయం నీదే.

“నేను క్రీస్తును విశ్వసించాను కాని, నాలో కొన్ని... నాకు మాత్రమే తెలిసిన రహస్యమైనవి కొన్ని నాలో మిగిలి ఉన్నవి.  వాటిని నేను ఎలా జయించగలను” అనే ఆలోచనలు ఉన్నప్పుడే ఈ అంతరంగ యుద్ధం మొదలవుతుంది. ఈ ఆలోచనలున్నంత మాత్రాన నీవు క్రైస్తవుడు కాదని కాదు గాని, క్రైస్తవ జీవితమే ఒక యుద్ధం. అందుకే కీర్తనా కారుడు కీర్తనలు 51:10 లో అంటాడు “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము”. మన అంతరంగంలోని మనస్సు యొక్క స్థిరత్వం కోసం ఈ పోరాటం. 

ఇదే అనుభవాన్ని అపో.పౌలు గలతి సంఘానికి వివరిస్తూ గలతి 5:17 “శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేక ముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు”.  ఒక నిజ క్రైస్తవుని జీవితం  ఆత్మ, శరీ కోర్కెల వైరుధ్యము తో నిత్యమూ యుద్ధమే. ఈ ఆత్మలోని సంఘర్షణ చెడ్డదేమీ కాదు. మర్త్యమైయ్యే మన శరీరం ఒకనాడు అమర్త్యతలోనికి ధరించాలనే మన ఆశ నెరవేరాలంటే , కోరికలు మన హృదయాలను నింపే రోజు కోసం మనం ఏంతో ఆశగా ఉన్నప్పటికీ, ఆ గమ్యాన్ని చేరే ముందు మనం గలవాల్సిన యుద్ధం మనలో మనమే.  అంతరంగ యుద్ధంలో గెలవాలంటే, నీకు నీవే పోరాడాలి, ఎవరూ మన బదులు పోరాడలేరు. ఈ అంతరంగ యుద్ధాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి. పాపంలో ప్రశాంతత మరణం. శరీరంతో యుద్ధం చేయడానికే క్రీస్తుతో ఐక్యమైన మన ఆత్మ సంసిద్ధంగా ఉంది. మన అంతరంగం కొన్ని సార్లు యుద్ధభూమిలా అనిపిస్తే హృదయపూర్వకంగా స్వీకరించండి. 

ప్రియ స్నేహితుడా, ఏదైనా సాధించాలనే సంకల్పం మనలో బలంగా ఉంటేనే మన చుట్టూ ఉండే పరిస్తితులు కూడా మనకు అనుకూలిస్తాయి, సర్వశక్తిమంతుడైన క్రీస్తు యేసు ద్వారా అనుకూలించబడతాయి.  ప్రతి సవాళ్ళపై విజయం వాటిని పోరాడి గెలిచినప్పుడే విజయోత్సవాన్ని చూడగలం. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/dEwzaVqJKjU 

Share this post