Skip to Content

ఆ వాక్యమే శరీరధారి..!

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

ఆ వాక్యమే శరీరధారి..!

యోహాను 1:1-18 "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను,...ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;"

ఆదియందు వాక్యముండెను అనగా, మొదట అది "దేవుని వాక్కు" అయియున్నది. అనగా "సృష్టికర్తయై యున్నది" (ఆది 1:1). ఆ వాక్యములో జీవముండెను. ఆ జీవమే నరునిలోని జీవాత్మాయెను (ఆది 2:8). ఆ జీవము అనగా జీవముగల ఆ వాక్యము మనుష్యులకు వెలుగై యుండెను (ఆది 1:3). ఆ వాక్యము ఆత్మచేత ఆవరింపబడియుండెను (ఆది 1:2). ఆ యాత్మ కన్యకయైన మరియను కమ్ముకొనియుండెను (లూకా 1:35). నిరాకారమును, శూన్యమును, చీకటియు, అగాధమును ఇక లేకపోయెను. వాక్యమైయున్న ఆది దేవుడు భూమ్యాకాశములను సృజించెను (ఆది 1:1). శూన్యమును, చీకటియుయైయున్న మరియ గర్భమున కుమారుని దాల్చెను. ఆదియందున్న ఆ వాక్యము, దేవుని యోద్దనున్న ఆ వాక్యము, దేవుడై యున్న ఆ వాక్యము; సమస్త సృష్టికి మూలమైయున్న ఆ వాక్యమే... శరీరధారి ఆయెను (యోహాను 1:14). మొదట శాసనమై యుండెను, తరువాత ధర్మశాస్త్రమై యుండెను తదుపరి ప్రవచనమైయుండెను. అయితే శరీరధారియైన ఆ వాక్యము కృపకు సత్యమునకు పరిపూర్ణతయాయెను. వాక్యం శరీరధారిగా... ఈయన పేరు యేసు క్రీస్తు ప్రభువు.

"యేసు" అను మాటకు "రక్షకుడు" అని అర్ధం. మత్తయి 1:21-23 లో "తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును.." అను సంగతి ప్రవచింపబడి నేరవేర్చబడింది. "క్రీస్తు" అనగా "అభిషిక్తుడు" - యూదులు ఎదురుచూస్తున్న రాజుకు, ఆయన ద్వారా వారు పొందబోవు విజయమును, తన భుజములమీద రాజ్య భారమును గూర్చి సంభోదిస్తుంది. ఆ వాక్యము శరీరధారియైయుండి; ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆదాము హవ్వలు పాపము చేసి దేవుని మహిమను కోల్పోయిన తరువాత, వారిని వారి తరువాతి సంతతిని తిరిగి నిత్యత్వములోనికి నడిపించడానికి, ఆ జీవము "యేసు క్రీస్తు" గా తన జనన మరణ పునరుత్థానం ద్వారా నేరవేర్చబడింది. 

ఆయన ఈ లోకమును దాని సమస్తమును సృజించినవాడైయుండి చీకటిలో ఉన్న మనకొరకు మరణచ్ఛాయలో ఉన్న మన జీవితములను వెలిగించడానికి వెలుగుగా అవతరించి శరీరధారియై మన మధ్య నివసించడానికి వచ్చాడు. క్రీస్తును కలిగియున్నమనము తన వెలుగు కలిగి ఆయన గుణాతిశయమును పొంది, తనతో నిత్యత్వంలో ఉండే ధన్యత పొంది, ఆయన మనకొరకు శరీరధారిగా అవతరించెనని తెలుసుకొనుటయే నిజమైన క్రీస్తు పుట్టుక. ఆయన రాకడ వేగిరమై, అందరము సిద్ధపడి నిత్యత్వంలో తనతో ఎల్లప్పుడూ ఉండే కృప ప్రభువు మనందరికీ దయచేయు విజయవంతులమవుదుము గాక!. ఆమెన్.


Share this post