Skip to Content

దానియేలు - Sunday School Story

20 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sirisha Raavi
  • Category: Children Stories
  • Reference: Sajeeva Vahini Apr - May 2011 Vol 1 - Issue 4

మీ అందరికి దానియేలు ఎవరో తెలుసా..

మనము ఈ కథలో దానియేలు ఎవరో, Lions దేవుని మాట ఎలా వింటాయో తెలుసుకుందాము.

దానియేలు ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యుడు. ఒకనాడు బబులోను రాజైన నెబుకద్నెజరు, అష్పెనజు అను తన యధిపతిని పిలిపించి ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,తత్వజ్ఞానము తెలిసినవారైన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుమని ఆజ్ఞాపిస్తారు. ఇది మూడు సంవత్సరముల ట్రైనింగ్ ప్రోగ్రాం. అప్పుడు అష్పెనజు యూదులలో నుండి దానియేలుహనన్యామిషాయేలుఅజర్యా అను వారిని ఎన్నిక చేస్తాడు. రాజు వాళ్ళను టెస్ట్ చేసినప్పుడు జ్ఞానవివేకముల సంబంధమైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను పది యంతలు శ్రేష్ఠులని తెలియబడెను. దానియేలు సకల విధములగు దర్శనములను, స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడుకూడా. ఇంకా దానియేలు చాలా జ్ఞానయుక్తముగ కూడా మాట్లాడగలరు. ఒక రోజు రాజు గారు ఒక కల కని దానిని మర్చి పోతారు. అప్పుడు రాజు అ దేశపు జ్ఞానులందరిని పిలిపించి ఆ కల, కలభావం చెప్పండి లేకపోతే అందరిని చంపించేస్తాను అంటారు. అప్పుడు దానియేలు నాకు కొంచెం సమయం ఇవ్వండి కల కలభావం చెప్పటానికి అని తెలివిగా రాజుగారిని అడుగుతారు. తరువాత దానియేలు ఆ కలని కలభావాన్ని రాజుకి చెప్తారు. అప్పుడు రాజు దానియేలుని చాలా హెచ్చించి బబులోను సంస్థానమంతటిపైన అధిపతిగా నియమిస్తారు. దానియేలు నిత్యము రోజుకి మూడు సార్లు దేవుని ప్రార్థించేవారు. ఒక రోజు రాజగు దర్యావేషు నెల రోజుల పాటు తననే ప్రార్థించాలి లేకపోతే సింహాల గుహలో వేయిస్తానంటారు. అయినాసరే దానియేలు మాత్రం ఎప్పటిలానే రోజుకి మూడుసార్లు జీవముగల తన దేవుని ప్రార్థించుట మాత్రం మానలేదు. అప్పుడు రాజు దానియేలుని సింహాల బోనులో విసిరేస్తారు.దానియేలు బహు ధైర్యవంతుడు... ఆ రాత్రంతా ఆ సింహపు బోనులోనే ఉండాలి. దానియేలుకి తన దేవుని సమర్థత తెలుసు కనుక అతను నిత్యము సేవిస్తున్న తన దేవుడు సింహములు ఏ హాని చేయకుండ వాటి నోళ్లు మూయించెను. అంటే lions దేవుని మాట విన్నాయన్న మాట. మరుసటి దినమున అందరు, దానియేలుని సింహాలు చంపేసి ఉంటాయి అనుకుంటారు. రాజు అక్కడకు వచ్చి చూస్తే దానియేలు బ్రతికి ఉన్నాడు. అది చూసిన రాజుకి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు రాజు ఆ రాజ్య ప్రజలందరికి ఇలా ప్రకటిస్తాడు: “దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయు-గములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును. ఆయన విడిపించు వాడును రక్షించు వాడునై యుండి, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటనుండి ఈ దానియేలును రక్షించెను” .

దేవుడెంత గొప్ప దేవుడు కదా...మనము దేవునిని నిత్యము ప్రార్థిస్తే, మనలను కాపాడతారు. మనము కూడా దానియేలు వలె ఎంతో ధైర్యవంతులం మన ప్రార్థన వలన, మన ద్వారా దేవునికి మహిమ.


Share this post