Skip to Content

యూదా వ్రాసిన పత్రిక

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

దేవుని కృపను జీవితమునకు సంరక్షణ కేడెముగా అమర్చుకొన్న విశ్వాసుల సంఘమును నాశనము చేయుటకు ప్రేరేపిస్తున్న అబద్ధ బోధనలు వ్యాపించినప్పుడు దానిని ఎదిరించు విశ్వాస వీరులనుగా వారిని సిద్ధపరచుట కొరకై వ్రాయబడినదే యీ యూదా పత్రిక. ఇట్టి అబద్ధ బోధనలను వ్యాపింపజేయు మనుష్యులకు దేవుని యొద్ద నుండి గల ఒక హెచ్చరిక యీ పత్రికలో యున్నది. అవిశ్వాసులుగా మారిన ఇశ్రాయేలీయులకును, అవిధేయత వలన పడిపోయిన దేవదూతగణమునకును, సొదొమ గోమోర్రా పట్టణ వాసులకును జరిగిన ఆపదలను స్మరించుకొని వీరికి రాబోవు న్యాయ తీర్పును గూర్చి పత్రిక రచయిత వారికి ప్రకటించుచున్నాడు. ఇటువంటి ఆపదలకు ముందుగా క్రైస్తవులు జాగ్రత్తగా ఉండవలెను. ఎదుర్కొన్న సవాలులు పెద్దవిగానున్నను దేవుడు యధార్థమైన తన బిడ్డలను పడిపోకుండ కాపాడుటకు శక్తిమంతుడైయున్నాడు.

గ్రంథ కర్త:- ఆంతర్యము చిన్నదైనను యూదా పత్రికను ముఖ్యమైనదొకటిగ ప్రారంభకాల సంఘము కలిగియుండెను. ప్రారంభ కాల సంఘ పితరులు దీని భాగములను ఉదహరించుట అలవాటుగా నుండెను. క్రీ.శ.171-లో ఏర్పడిన మురాట్రోరియన్ కానోనిల్ దీని భాగములు చేర్చబడెను. టెర్టలియాన్, ఒరిగెన్ వంటి సంఘ పితరులు దీనిని దేవుని వాక్యములో ఒక భాగముగా అంగీకరించిరి.  “యేసుక్రీస్తు - దాసుడును. యాకోబు సహోదరుడును” అని రచయిత తన్ను గూర్చి సూచించుచున్నాడు. (యూదా 1:1) ఈ ఒప్పుకోలు 17వ వచనమందు వచ్చు అపొస్తలులను గూర్చిన సూచనలతో చేర్చి చూచినపుడు యీయన పదకొండుమంది అపొస్తలులలోని ఒకడైన యాకోబు సహోదరుడైన యూదా కాదు అని ఆలోచించుటకు మార్గము చూపుచున్నది. మత్తయి 13:55 నందును, మార్కు 6:3 లో యీ యూదాను గూర్చి గుర్తించబడుచున్నది. ఇతని జ్యేష్ఠ సహోదరుడైన యాకోబు యెరూషలేము సంఘ పెద్దయు (అపో. కార్యములు 15:13-21) అతను పేరు మోసిన పత్రిక యొక్క రచయిత అగును. యేసు యొక్క యితర సహోదరుల వలె యూదా కూడ ప్రభువు యొక్క పునరుత్థానము వరకు ఆయనను విశ్వసించలేదు. (యోహాను 7:1-9అపో. కార్యములు 1:14) వీటి తరువాత ఇతని గూర్చి ఒకే సూచన 1 కోరింథీయులకు 9:5 లో వచ్చుచున్నది. అందులో ప్రభువు సహోదరులు తమ సువార్త సేవా ప్రయాణమందు స్వంత భార్యలను తీసుకొని వెళ్ళినట్లు తెలియుచున్నది. అపో. కార్యములు 15:22 నందును అపో. కార్యములు 15:32 నందును చెప్పబడు యూదా ఒక వేళ యితడైయుండవచ్చును. పరిశుద్ధ గ్రంథమునకు బయట చెప్పబడు పారంపర్య కథలును యీ యూదాను గూర్చి ఇతర వివరములను చెప్పలేదు.

ఉద్దేశము:- సంఘములు విశ్వాసమందు. స్థిరముగా నిలుచుటకును అబద్ధ బోధనలకు విరోధముగా నిలచి విశ్వాసమును కాపాడుటకును స్మరింపజేయుట.

ఎవరికి వ్రాసెను? యూదా క్రైస్తవులకును విశ్వాసులు యావన్మందికిని.

వ్రాయబడిన కాలము:- దాదాపు క్రీ.శ.65.

ఆంతర్యము:- మొదటి శతాబ్దము ప్రారంభమై కట్టు కథలచేతను, అబద్ధ బోధనల చేతను సంఘము బెదరించబడుచుండెను.

ముఖ్య వచనము:- "ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గల వాడనై ప్రయత్నించుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధనిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను”. (యూదా 1:3).

ముఖ్య పాత్రలు: - యూదాయాకోబుయేసు.

ముఖ్య పదము:- విశ్వాసముకొరకుపోరాడుడి.

ముఖ్య వచనము:- యూదా 1:3.

గ్రంథ విభజన:- క్రొత్త నిబంధనయందు పౌలు మరియు ఇతర రచయితల పత్రికలలో ఒక పెద్ద భాగము అబద్ద ప్రవక్తలచే కలుగు ఆపదను ఎత్తిచూపుచున్నది. అయినను యీ విశ్వాస త్యాగులు కఠినముగ ఖండించుచు యీ ఆపదకు వ్యతిరేకముగ విశ్వాసము కొరకు పోరాడుటలో క్రైస్తవులను ప్రోత్సాహపరచు కార్యమందు యూదా ముందు నిలుచుచున్నాడు. పత్రిక యొక్క ప్రారంభమును చివరి స్తుతి గీతమును తప్ప మిగిలిన వచనములన్నియు యీ భయంకరమైన ఆపదను గూర్చి మాట్లాడునవగును. క్లుప్తముగనున్నను తీవ్రమైన వర్తమానము గలది. నాల్గు భాగములుగా యీ పత్రికను విభజించవచ్చును.

(1) పత్రిక వ్రాయబడిన ఉద్దేశము. యూదా 1:1-40.

(2) అబద్ధ బోధకులను గూర్చిన వివరణ. యూదా 1:5-16.

(3) అబద్ధ బోధకులను ఎదుర్కొ నవలసిన విధము. యూదా 1:17-23.

(4) స్తుతి గీతము. యూదా 1:24 – 25.

కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథములోని 65వ పుస్తకము; అధ్యాయము 1: వచనములు 25; ప్రశ్నలు లేవు; చారిత్రక వచనములు 22; నెరవేర్చబడిన ప్రవచనము 1; నెరవేర్చబడనివి 2.


Share this post