- Author: Sajeeva Vahini
- Category: Bible Study
- Reference: Sajeeva Vahini
దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యమును యోవాషు రాజు క్రీ.పూ 835వ సంవత్సరము నుండి 796వ సంవత్సరము వరకు పరిపాలించెను. ఆ రాజు కాలములో గొప్ప మిడుతల దండు ఒకటి ఆదేశములో ప్రవేశించెను. ఆదండు ఆదేశములోని పొలము పంటలను, ఫలవృక్షములను సర్వనాశనము చేయగా దేశ ప్రజలు బహుగా క్షామపీడితులైరి. అట్టితరుణములో దేవుని ప్రవక్త లేక దీర్ఘదర్శిమైన యోవేలు ద్వారా దేవుడు తన సందేశమును ప్రజల యొద్దుకు పంపెను. ఆ సందేశమే యోవేలు గ్రంథము. మిడుతల దండు సృజించిన ఈ భీబత్సము - మానవుని పాప ఫలితముగా దేవుడు పంపిన కఠిన దండనను వర్ణించుచున్నది. అయితే అంత్యదినములలో అనగా ప్రభువు దినమున దేవుడు ప్రజల మీదికి తీసుకొని రాబోవుచున్న ప్రతి దండన మిక్కిలి భయంకరముగా నుండునని యోవేలు హెచ్చరించుచున్నాడు. ప్రభువు దినమున దేశము మీదికి రాబోవు అపాయము బహుకఠినముగా నుండుననియు, దాని ముందు గత కాలపు ప్రతి దండన మిక్కిలి అల్పమైనదిగా నుండుననియు ప్రవక్త వివరించెను. ఆదినమున దేవుడు తన శత్రువులనునిత్య తీర్పునకు లోబరచును. తనకు యధార్ధముగా లోబడువారికి ఆయన శ్రేష్ఠ ఫలముల నిచ్చును.
యోవేలు అను పదమునకు హెబ్రీభాషలో యెహోవాయే దేవుడు అని అర్థము. ఈ అర్థము గ్రంథసారాంశముతో ఏకీభవించుచున్నది. దేవుడు చరిత్రయంతటిపై సర్వాధికారిగా పరిపాలించుచున్నాడని ఈ నామము స్పష్టపరచుచున్నది. సర్వశక్తి సంపన్నుడైన మన దేవుడు, సమస్త ప్రకృతి మీదను, సకల రాజ్యముల మీదను సర్వాధికారము కలిగియున్నాడు.
గ్రంథకర్త : ఈ గ్రంథరచయిత యోవేలు. యోవేలు అను పేరు గల మరి పదుముగ్గురిని పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలము. అయితే ప్రవక్తయైన యోవేలును గూర్చిన సమాచారమును ఈ గ్రంథములో మాత్రమే కనుగొనగలము. ఈ గ్రంథరచయిత పెతూయేలు కుమారుడని విశదమగుచున్నది. పెతూయేలు అనగా దేవుని చేత ప్రేరేపణ పొందినవాడు అని అర్థము. సీయోనును గూర్చియు, దేవాలయమును గూర్చియు మాటి మాటికి ప్రస్తావించుటను బట్టి యోవేలు యెరూషలేమునకు సమీపముగా నివసించెనని మనము తలంచవచ్చును. యాజకత్వమును గూర్చి యోవేలు 1:13-14; యోవేలు 2:17 మున్నగు వచనములలో చెప్పినందున యోవేలు ఏకకాలమున ప్రవక్తగాను, యాజకుడుగాను ఉండియుండెనని కొందరు అభిప్రాయపడుచున్నారు. ఏది ఏమైనను, జనులు మారు మనస్సు పొందవలెనని యోవేలు ప్రవక్త అసందిగ్ధమైన భాషలో క్లుప్తముగా, స్పష్టముగా బోధించెను.
యోవేలు కాలము : యూదయలో పరిచర్య చేసిన ప్రారంభ ప్రవక్తలలో యోవేలు ఒకడు. యోవేలు 3:16ను ఆమోసు 1:2తోను, యోవేలు 3:18ను ఆమోసు 9:13 తోను పోల్చి చూచినప్పుడు ఆయా వాక్యముల సమభావములను బట్టి ఆమోసు ఈయనకు (యోవేలుకు) సమకాలికుడని మనము తలంచుటకు వీలు కలుగుచున్నది. క్రీ.పూ 835 నుండి 796 వరకు యూదా రాజ్యపాలన గావించిన రాజాయెను. ఆయనకు రాజ్యపాలన చేయు వయస్సు వచ్చువరకు - దేశము యాజకుడైన యెహో యాదా సంరక్షణలో నుండెను. అందువలన యోవేలు తన గ్రంథములో ఏ రాజు పేరునైనను ప్రస్తావించి యుండ లేదు అని కొందరు అభిప్రాయపడుచున్నారు. యోవేలు తొలి ప్రవక్తలలో ఒకడైయుండినందున ఈయన ఎలీషా ప్రవక్తకు సమకాలికుడు అయ్యే అవకాశము గలదు.
ముఖ్య సందేశము : మహాభయంకరమైన ప్రభుదినము రాబోవుచున్నది అనునది యోవేలు అందించిన ముఖ్య వర్తమానము.
ప్రాముఖ్య వచనములు : యోవేలు 2:11; యోవేలు 2:28-29
ప్రాముఖ్యమైన అధ్యాయము : 2
ఇప్పుడైనను మీరు ఉపవాసముండి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి (యోవేలు 2:12-13) అనునదియే యోవేలు పిలుపు. యూదాజనం, ప్రవక్త చెప్పిన ప్రకారము దేవుని వైపు తిరిగిన యెడల, దేవుడు తాను చేయ నుద్దేశించిన కీడును చేయక మానుకొనును అను వాగ్దానమును యోవేలు వారికి ఇచ్చియున్నాడు. హృదయ పూర్వకముగా పశ్చాత్తాపపడు వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడునను దేవుని వాగ్దానమును కూడ యోవేలు వారికి తెలియజేసెను. పెంతెకోస్తు దినమున మేడ గదిలోనున్న విశ్వాసుల మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చుట ఈ వాగ్దానమును అనుసరించి జరిగినదే. పశ్చాత్తాప పడని వారి మీదికి యేసు క్రీస్తు రాకడ దినములలో దేవుని న్యాయ తీర్పు వచ్చును.
సారాంశము : యోవేలు గ్రంథము నందు మిడుతల దండువలన సంభవించిన వినాశము, హానికరమైన వ్యాధులు, క్షామములు, అగ్నివలన కలుగు ప్రమాదములు సైన్యములు దండెత్తుట, ఆకాశము నుండి వచ్చు అపాయములు అను అపాయముల పట్టికను చూడగలము. రాబోవు న్యాయ తీర్పు వర్ణింపబడినది. దేవుని కృపను, విశ్వాసమును పుట్టించు దేవుని వాగ్దానములను ఈ గ్రంథములో చూడగలము. ప్రభువు దినమును గూర్చి భూతకాలములో చెప్పబడినను అది భవిష్యత్తులో జరుగనున్నది.
గ్రంథ విభజన : (1) ప్రభువు దినము. భూతకాల దృష్టి యోవేలు 1:1-20
(అ) గతించిన కాలములో జరిగిన మిడుతల దాడి యోవేలు 1:1-12
(ఆ) పైరులు, ఫలములు నశించుట, క్షామము యోవేలు 1:13-20
(2) ప్రభువు దినము : భవిష్యత్ కాల దృష్టి Joel,2,1,21
(అ) సమీపించుచున్న ప్రభువు దినము యోవేలు 2:1-27 అన్యులు దండెత్తుట.
(ఆ) బహుదూరమున నున్న ప్రభువుదినము. యూదులు దేవుని వైపు మరలుట, అంతిమన్యాయ తీర్పు Joel,2,28-3,21
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 29వ పుస్తకము; అధ్యాయములు 3; వచనములు 73; ప్రశ్నలు 7; ఆజ్ఞలు 50; వాగ్దానములు 10; ప్రవచన వాక్యములు 69; నెరవేరినవి 11; నెరవేరబోవునవి 59; దేవుని యొద్ద నుండి వచ్చిన సందేశము 1. (Joel,1,2-3,21)