- Author: Sajeeva Vahini
- Category: Bible Study
- Reference: Sajeeva Vahini
తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” (1 కోరింథీయులకు 10:12) పౌలు యొక్క ఈ బోధన యోహానుని యీ చిన్న పత్రిక యొక్క సారాంశముగా అనుకొనవచ్చును. ఏర్పరచబడిన అమ్మగారికిని ఆమె పిల్లలకును యీ పత్రిక వ్రాయబడెను. వారు క్రీస్తునందు స్థిరులైయున్నారని తెలియబడుచున్నది. వారు సత్యముననుసరించి నడచువారును వారికప్పగింపబడిన దేవుని ఆజ్ఞలను గైకొనువారుగా నుండిరి. ఈ కార్యమందు పత్రిక రచయిత సంతృప్తి గలవాడుగా నున్నాడు. అయినను నిలుచుట అనునది పడుటకు ఒక మెట్టు దూరముననున్న స్థితియగును. అందుచే వారు జాగ్రత్తగా నుండవలసిన బాధ్యత గలవారుగానుండి.
ఒకనినొకరు ప్రేమించుట అనునది క్రొత్త ఆజ్ఞ కాదు. దేవుని ఆజ్ఞలన్నిటి సారమే. అయినను యీ ప్రేమ కళంకము లేని, పరిశోధించక ఒకనికి తలుపు తెరచియిచ్చినటువంటిదిగ ఉండకూడదు. ముఖ్యముగ క్రీస్తును శరీరముతో వచ్చిన వాడని అంగీకరించని చదువరులు దేశమంతయు కనిపించు సమయమున వారితో సహవాసము నుండి దూరముగా నిలువవలసిన ఆవశ్యకతను రచయిత దృఢముగ చెప్పుచున్నాడు.
ఉద్దేశము:- క్రీస్తును వెంబడించుటకు ఆధార పాఠములైన సత్యమునకును ప్రేమకును దృఢత్వమునిచ్చుట, అబద్ధ బోధకులను గూర్చి హెచ్చరించుట.
గ్రంథ కర్త:- యోహాను రెండవ మూడవ పత్రికలకు వాటి ఆంతర్యమునను, లోపలను ఇమిడియున్న పోలికలు వాటి రచయితను గూర్చి ఒకటిగ ఆలోచించుటకు తగును. వీటియందు గుర్తించబడిన మనుష్యుల తక్కువ సంఖ్య, పత్రికల క్లుప్తీకరణ, మొదటి పత్రికయందు చెప్పబడియున్నట్లు భిన్నమైన నూతన వర్తమానముల కొరతవంటి కారణములచే ప్రారంభకాల సంమము పితరుల అక్షరములందు యివి తక్కువగానే ఉదహరించబడెను. అయినను అపొస్తలుడైన యోహాను కాలమునకు సమీప కాలమున జీవించిన సంఘ పితరులు ముఖ్యముగా ఐరేనియస్, అలెగ్జాండ్రియా క్లెమెంతు మొదలగువారు సందేహము లేక వీటిని అపొస్తలుడైన యోహాను పత్రికలుగ అంగీకరించి యున్నారు. అపొస్తలుడు తన పేరును పత్రికయందు గుర్తించలేదు. “పెద్దనైన నేను” అని మాత్రమే సూచించెను. అపొస్తలుడైన పేతురు కూడ తన్ను ఒక పెద్దగ సూచించుచున్నాడు. (1 పేతురు 5:1) శైలి ప్రయోగము, సంక్షేపము, అనుచరణ విధానము మొదలగు వాటిని రెండు పత్రికలును సమముగా పొందియున్నవి. యోహాను సువార్తతోను, మొదటి పత్రికతోను దగ్గర సంబంధము కలిగియున్నది. కనుక వెలుపటి, లోపలి ఆధారముల మూలముగ యివి అపొస్తలుడైన యోహాను పత్రికలని ముగించి చెప్పవచ్చును.
ఎవరికి వ్రాసెను:- ఒక సన్మానింపదగిన అమ్మగారికిని, వారి కుటుంబ సభ్యులకును, ఒకవేళ స్వస్థలపు సంఘమునకును వ్రాసియుండవచ్చును.
వ్రాయబడిన కాలము:- 1 యోహాను వ్రాయబడినపుడే. క్రీ.శ.90లో ఎఫెసులో నుండి.
ఆంతర్యము:- యోహాను సేవ చేయుచుండిన ఒక స్వగ్రామ సంఘ సభ్యులైన యీ పెద్ద అమ్మగారు, ఆమె కుటుంబస్థులు వుండి యుండవచ్చును. వారి మధ్య మంచి బంధముండెను. కొన్ని సంఘములందు పలుకుబడిగల అబద్ధ బోధకులను గూర్చి యోహాను హెచ్చరించెను.
ముఖ్య వచనము:- వచ.6. మనమాయన ఆజ్ఞల ప్రకారము నడచుటయే ప్రేమ: మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.”
ముఖ్య పాత్రలు: యోహాను. అమ్మ గారు, ఆమె పిలలు.
ముఖ్య పదజాలము:- అబద్ద బోధకుల సహవాసమును విడచి దూరమగుడి.
ముఖ్య వచనములు:- 2 యోహాను 1:9-10.
గ్రంథ విభజన:- ఈ చిన్న పత్రికకు మొదటి పత్రికతో దగ్గర భావపోలిక కలదు. తన చదువరులకు ప్రేమ యొక్క సలహానిచ్చుటతో బాటు ప్రేమతో జ్ఞానముతో నడచుకొనవలెననియు చెప్పెను. పత్రికకు తేటయైన రెండు భాగములు గలవు:-
(1) దేవుని ఆజ్ఞలను గైకొనుట :- 2 యోహాను 1:1-6.
(2) అబద్ధ బోధకులను విడచి దూరమగుట.:- 2 యోహాను 1:7-13.
కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 63వ పుస్తకము; అధ్యాయము 1; వచనములు 13; ప్రశ్నలు లేవు; ప్రవచనములు లేవు.